తెలంగాణ

Harishrao: రైతులకు నీళ్లు ఇవ్వడానికి నా రక్తమైనా ఇస్తా: సీఎంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం, రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్లే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఎండగడుతున్నాయని ఆరోపించారు. "రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అంటూ హరీశ్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

 రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయనలోని రక్తపిపాసి మనస్తత్వానికి నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా దుర్భాషలాడటం తప్ప రేవంత్ రెడ్డి ఎలాంటి పరిపాలనా విషయం నేర్చుకోలేదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఎలా ఆన్ చేస్తారని సీఎం ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శించారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను విజయవంతంగా ఆన్ చేయవచ్చనే కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు.

 ఈ విషయంపై అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టత ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రికి ఇంకా సోయి రాలేదని దుయ్యబట్టారు. మోటర్లు ఆన్ చేస్తే గత ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన అబద్ధాలు, దుష్ప్రచారం బయటపడతాయనే భయంతోనే రైతులకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, వాస్తవాలు మాట్లాడే రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో వేస్తానని బెదిరించడం దుర్మార్గమన్నారు. పాపం పండిన నాడు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు.

 ఇదే క్రమంలో షాబాద్ ఆరు హత్యల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్రమైన పోలికలతో విమర్శలు గుప్పించారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వింటే షాబాద్ దారుణ హత్యల నిందితుడికి, రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేనట్లు అనిపించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద దారుణం జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు కానీ, మన రాష్ట్ర సీఎంకు గానీ, హోంమంత్రికి గానీ కనీసం పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంతటి అమానుష ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుంటే, నిన్న మధ్యాహ్నం ఓ పోలీస్ ఉన్నతాధికారి బాధ్యత లేకుండా గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేశారని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు.

 

#HarishRao#RevanthReddy#KaleshwaramProject#ShabadMurders#TelanganaPolitics#BRSvsCongress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి