ప్రముఖ ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ సంస్థలపై కేంద్రం కొరడా ఝలిపించింది. వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా నోటీసులు ఇచ్చింది. ఫుడ్, వెజిటబుల్స్, మిల్క్, బ్రేక్ ఫాస్ట్, పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన క్రమంలో క్విక్ కామర్స్ సంస్థ ఇన్ స్టామార్ట్ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయింది. పాడైన వస్తువులు డెలివరీ చేస్తుండటంతో భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే ఆహార భద్రతా చట్టం-2006 కింద నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంటూ ఏకంగా స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌కు తొమ్మిది నోటీసులు జారీ చేసింది. గడువు ముగిసిన ఉత్పత్తులు, పాడైన ఆహారం, కలుషిత గుడ్లు, పాలు, దెబ్బతిన్న ప్యాకేజింగ్‌లో ఆహార పదార్థాల సరఫరా వంటి ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాకుండా, నాణ్యత నియంత్రణ, ఆహార భద్రత పర్యవేక్షణ, ఇన్వెంటరీ నిర్వహణ, స్టాక్ రొటేషన్, పరిశుభ్రత, నిల్వ విధానాలు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, దిద్దుబాటు చర్యలు వంటి అంశాలపై డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన నివేదికను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. సమాధానం ఇవ్వలేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపింది.
చెల్లని లేదా తప్పుగా పేర్కొన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్లు, లైసెన్స్‌లో లేని బ్రాండ్ల విక్రయం, విక్రేతల నమోదు, ట్రేసబిలిటీ, నిబంధనల అమలు వ్యవస్థల్లో లోపాలపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రశ్నలు పలు లేవనెత్తింది. ఫిర్యాదులు పరిష్కరించకుండా కేవలం రీఫండ్‌లు ఇవ్వడం సరిపోదని స్పష్టంచేసిన నియంత్రణ సంస్థ.. సమీప భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపైనా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి స్పష్టమైన ప్రణాళికను ఇవ్వాలని కోరింది. సరైన స్పందన రానియెడల కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో తెలిపింది. కాగా, మరిన్ని క్విక్ కామర్స్ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ విభాగం దృష్టి సారించాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.












