గ్రామసింహాలు అని పిలుచుకునే కుక్కల వల్ల మేలు ఎంతుందో కీడు కూడా అంటే ఉందని పలు సంఘటనలు నిరూపించాయి. ఇక మనిషి పూర్తిగా ఆధునిక జీవన విధానంలోకి మారిపోయాక.. మనుషులతో బంధాలకంటే.. కుక్కలతోనే ఎక్కువ ప్రేమగా ఉండటానికి అలవాటు అయ్యాడు.. అయితే పెంపుడు కుక్కల వల్ల అంతగా ప్రమాదం లేకపోయినా.. వీధి కుక్కలు వల్ల అయితే వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రమాదాల బారిన పడటం వంటి ఘటనలు ఎక్కువ జరగడం తెలిసిందే..
ఇక చిన్న పిల్లలు అయితే శునకాల నోటికి చిక్కారంటే ప్రాణాల మీద ఆశ వదులుకునే పరిస్థితులున్నాయి. అయితే నేడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాల నుండి తాత్కాలికంగా బయటపడే అవకాశాలున్నాయి. అలాంటి వాటిని అభివృద్ధి చేసేపనిలో టెక్నాలజీ నిపుణులు నిమగ్నమయ్యారు..
ఇందులో భాగంగా కేరళకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థుల బృందం కుక్కల బారి నుండి కాపాడుకునే పరికరాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు.. చెంగనూర్‌లో ఉన్న సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు ఓ స్మార్ట్ వాచ్‌ను అభివృద్ధి చేస్తున్నారట.. కుక్కలు వింతగా ప్రవర్తించడం, కరవడానికి వచ్చే సమయంలో ఈ వాచ్‌కున్న బటన్‌ను నొక్కగానే అది తన పని చేయడం ప్రారంభిస్తుందట..
ఈ గాడ్జెట్ సుమారు 20-40 కిలోహెర్జ్ అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలను విడుదల చేస్తుందని.. ఇది వీధి కుక్కల్ని పారిపోయేలా చేస్తుందని వారు తెలిపారు.. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఇలా అందరికీ ఉపయోగపడే ఈ వాచ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. కాగా ఈ వాచ్ నమూనాకు ‘సెన్స్-కె9’ అని పేరు పెట్టినట్టు తెలిపారు..












