రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి సరఫరాపై గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై ఘాటుగా స్పందించిన ఆయన, ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
"నేను చేసిన ఒకే ఒక్క తప్పు.. అవినీతికి పాల్పడిన ఈ రిటైర్డ్ ఇంజనీర్లను ఇప్పటివరకు బొక్కలో (జైల్లో) వేయకపోవడమే" అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల డిజైన్ల పేరుతో రాష్ట్రాన్ని ముంచిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి రిటైర్డ్ ఇంజనీర్లను ముందే చర్లపల్లి జైలుకు పంపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సీఎం పేర్కొన్నారు.
నీటి విడుదలపై హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబడుతూ.. "అన్నం తినేవాడు మాట్లాడే మాటలేనా హరీష్ రావ్ ఇవి?" అంటూ నిలదీశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల విషయంలో హరీశ్ రావు, ఆయన మామ కేసీఆర్ ఏం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన 'కిలాడి కమిటీ'లలో హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్ కీలక సభ్యులుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
హరీశ్ రావు చేసిన రక్త దానం వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. "వీరిని కోసి రక్తం జల్లితే అవే పండుతాయి" అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు వేయాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, రైతు వేదికల ద్వారా రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ ఉనికి కోసమే అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.












