ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మరో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భుజానికి సర్జరీ జరిగింది. కొకిలాబెన్ ఆస్పత్రి నిపుణుల బృందం ఆయనకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. మరో రెండు నెలల తర్వాత మరో భుజానికి సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన గత కొంతకాలంలో భుజం కండరాల నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల ముక్కుకు కూడా పవన్ సర్జరీ చేయించుకున్నారు.
పవన్‌కు వరుసగా సర్జరీలు జరగుతుండటంతో అటు అభిమానులు, ఇటు జనసైనికులు, కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొనిదెల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్ క్రియేటివ్ వర్క్స్ విడుదల చేసిన ప్రత్యేక సందేశాన్ని షేర్ చేశారు. ‘మా వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ గారు విజయవంతమైన శస్త్రచికిత్స అనంతరం త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.
ఎన్నో జీవితాలను తాకిన ఆ చేతులు, లక్షలాది మంది ఆశలను మోసిన ఆ భుజాలు, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పిడికిలి మునుపటి కంటే మరింత బలంగా తిరిగి వస్తుంది. మీ అంకితభావం, ప్రజాసేవ పట్ల మీ నిబద్ధత కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మీరు త్వరగా కోలుకుని మరింత శక్తివంతంగా ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాం’ అని రాసుకొచ్చారు. అన్నా కొనిదెల ఈ సందేశాన్ని తన ఇన్ స్టాలో హైలైట్ చేయడంతో అభిమానులు మరింత ఎమోషనల్ అయ్యారు. ‘గెట్ వెల్ సూన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, పవన్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సైతం నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.పలువురు రాజకీయ నాయకులు సైతం ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.












