ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక దేశం, మరో దేశం మీద దాడి చేసుకుంటూ.. ప్రపంచానికి మనశాంతి లేకుండా చేస్తున్నాయి. దేశాధి నేతల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. కొన్ని పేద దేశాలలో అయితే ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల ఆకలి మరణాలు పెరుగుతున్న సంఘటనలు వార్తల్లో వస్తున్న విషయం తెలిసిందే..
ప్రపంచ వ్యాప్తంగా కోలుకోలేని నష్టాలు జరుగుతున్నా, మనుషుల ప్రాణాలు పోతున్న యుద్ధాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ విషయంలో మాత్రం భారత్ మాత్రం సేఫ్ సైడ్ ఉందనే చెప్పాలి. కానీ అప్పుడప్పుడు మనదేశానికి చెందిన కొందరు వ్యక్తులు మరణించడం విషాదకరం..
ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న.. తాజాగా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇరాన్ (Iran) చేసిన దాడిలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. ఒమన్ తీరం వద్ద హర్మూజ్ జలసంధిలో.. వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్ గెలాక్సీపై జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
సైప్రస్ జెండాతో వెళ్తున్న ఈ నౌకపై దాడి జరిగిన సమయంలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా.. వారిలో 10 మందిని రక్షించినట్టు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అందులో గల్లంతైన ఒకరి జాడ కోసం ఒమన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపిన భారత దౌత్య కార్యాలయ అధికారులు ఒమన్ ప్రభుత్వం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపింది.
మరోవైపు ఈ ఘటనతో హర్మూజ్ జలసంధి ఉద్రిక్తంగా మారిపోయింది. కాగా అమెరికా ఇరాన్‌లోని మొత్తం 140 లక్ష్యాలపై ఇప్పటి వరకు దాడులు చేసింది.












