భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. గానకోకిల ఎస్.జానకి(88) మరణవార్త విన్న యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవగా, దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల్లో పెను విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమెకు ఘన నివాళి అర్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజు (జూలై 12) సాయంత్రం 5 గంటలకు మైసూరు వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
జానకమ్మ భౌతికకాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఈ ఉదయం 7:30 గంటల నుంచే మైసూరులోని ప్రముఖ మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో ఉంచారు. తమ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రియతమ గాయనిని చివరిసారిగా చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం, సాయంత్రం 5 గంటల సమయంలో కనియర హుండి గ్రామంలో ఉన్న ఆమె సొంత ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
జానకమ్మ మృతి పట్ల మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ ఎస్. యతీంద్ర సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె భౌతికంగా మనకు దూరమవ్వడం భారతీయ సంగీత లోకానికి ఎప్పటికీ పూడ్చలేని తీరని లోటని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జానకమ్మ మనవరాలు అప్సర వైద్యుల సామాజిక మాధ్యమాల ద్వారా ఈ దుఃఖవార్తను పంచుకుంటూ.. తమ ప్రియమైన బామ్మ తన మధుర స్వరంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో శ్రోతలకు ఆనందాన్ని, సాంత్వనను పంచారని ఎమోషనల్ అయ్యారు.
ఎస్. జానకి తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు దాదాపు 20కి పైగా భాషల్లో 50 వేలకు పైగా గీతాలను ఆలపించి భారతీయ సంగీత చరిత్రలో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఆరు దశాబ్దాల పాటు కళారంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించింది.












