స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

పోలీసులకు లోపించిన క్రైమ్ సెన్స్ ! జేబు నిండితే చాలా??..

రచన: Venu8 నిమిషాల పఠనం

విచక్షణ కోల్పోతున్న మనుషులు మృగాళ్లుగా మారి రక్తం రుచి మరుగుతున్నారని ఈ మధ్య కాలంలో జరిగే దారుణాలను చూస్తే అర్థం అవుతుంది. కన్నవారు, కట్టుకున్నవారు, తో బుట్టువులు ఇలా బంధాలను పాతరేసి, నమ్మించి ప్రాణాలు తీస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగడం ఆందోళన కలిగించే అంశం..

ప్రస్తుత సమాజంలో మానవత్వం మంట కలిసింది. బంధాలకు విలువ లేకుండా పోయింది. మనిషి చెప్పే నీతులకు.. ఆచరణకు మధ్య ఎంతో వ్యత్యాసం ఏర్పడింది. విచక్షణ కోల్పోతున్న మనుషులు మృగాళ్లుగా మారి రక్తం రుచి మరుగుతున్నారని ఈ మధ్య కాలంలో జరిగే దారుణాలను చూస్తే అర్థం అవుతుంది.

ఎన్నో హత్యలు.. కన్నవారు, కట్టుకున్నవారు, తో బుట్టువులు ఇలా బంధాలను పాతరేసి, నమ్మించి ప్రాణాలు తీస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ లోకంలో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తుంటే లోపం ఎక్కడ ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి చట్టం ఏం చేస్తుందనే అనుమానాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

వ్యవస్థ మారుతుందా?.. వ్యవస్థను నడిపే మనిషి మారుతున్నాడా? అనే అయోమయంలో ఇప్పుడు మనిషి బ్రతుకున్నాడని అనిపిస్తుంది. ఇక లోకంలో చంపడం అనేది ఎంత సులువుగా మారిందో వరుసగా జరుగున్న హత్యలను చూస్తే అర్థం అవుతుంది. అప్పటి వరకు మనతో ఉన్న మనిషే కాలుడై ప్రాణాలు తీస్తుంటే.. ఇక నమ్మేది ఎవరిననే ప్రశ్నలు ఉద్ధవిస్తున్నాయి.

తాజాగా రంగారెడ్డి జిల్లా..షాబాద్‌ లో జరిగిన సంఘటన మరోసారి రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వరుసగా ఆరుగురిని హత్య చేసిన ఉన్మాది గతం చూస్తే లోపం ఎక్కడుందో అర్థం అవుతుంది. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ విఫలం అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ మైనర్ బాలికను వేధించిన విషయంలో అరెస్ట్ అవ్వగా.. పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి లోపల వేశారు.

అయితే ఈ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్! ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత బాలిక కుటుంబం తనపై పెట్టిన పోక్సో కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు.. రాజ్‌కుమార్ అక్షరాల రూ.20 లక్షలు లంచం ఇచ్చాడని ప్రచారం అవుతుంది. నిందితుడు అంత భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చాడు కాబట్టే.. పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు పెట్టకుండా, స్టేషన్ బెయిల్ వచ్చే బలహీన సెక్షన్లు పెట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఫోక్సో కేసులో అరెస్టయిన రాజ్‌కుమార్, జైలు నుంచి విడుదలయ్యాక కక్ష పెంచుకుని భార్య పిల్లలతో సహ, కేసుపెట్టిన అమ్మాయిని, వారి కుటుంబ సభ్యులను అంతం చేశాడు. మరోవైపు పోలీసుల చేతికి డబ్బులు ముట్టడం వల్లే.. రాజ్‌కుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. అంతర్గత విచారణ జరిపి, ఒక్కొక్క అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే ఎస్సై రమేష్‌ను సస్పెండ్ చేయగా.. ఇప్పుడు సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సీపీ తరుణ్ జోషీ ఆదేశం ఇవ్వడం చూస్తుంటే ఈ కేసులో ఏదో బయటకు రాని రహస్యం దాగుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనం.. ఇదిలా ఉండగా లవర్ పెండ్లి చెడగొట్టి , కులాంతర వివాహం చేసుకున్న కూడా ఆమెను కాదని మరో మైనర్ బాలిక పై లైంగిక దాడి చేశాడు అంటే.. అప్పుడే పోలీస్ స్టైల్లో ఇంటరాగేషన్ చేసి, గట్టిగా ట్రీట్మెంట్ ఇస్టే ఆ ఆరుగురు బ్రతికేవారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఒక్క ఘటనే కాదు గతంలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుతో పాటు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి విషయంలో సైతం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఉన్మాదులు ఇంతటి ఘాతుకాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థతో పాటు.. పోలీసు డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారుల నుండి.. పోలీసుల వరకు లంచాలకు మరిగారనే ఆరోపణలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయని భావిస్తున్నారు.

మరోవైపు హంతకుడు రాజ్ కుమార్.. నిన్ను చంపేస్తా.. ఈ పోలీసులు, ప్రభుత్వం నన్నేం పీకలేరు అంటూ హత్యకు ముందే భార్యను చంపేస్తానని, తనను ఎవరేం చేయలేరని బెదిరించిన వీడియో సంచలనంగా మారింది. యూట్యూబర్ వైష్ణవిని భర్త హత్య చేస్తే పోలీసులు, ఈ ప్రభుత్వం ఏం చేశారు.. అలాగే నన్నూ కూడా ఎవరు ఏం చేయలేరు అంటూ భయపెట్టడం చూస్తుంటే.. ఇలాంటి కిరాతకుల ధైర్యానికి కారణం ఎవరో ఇప్పటికైనా ఆలోచించవలసిన అవసరం ఉంది.

ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగి ఇలాంటి హంతకులను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చివరికి న్యాయాన్ని రక్షించి.. తప్పుచేస్తున్న వారిని శిక్షించవలసిన అధికారులు సైతం.. జేబులు ఎలా నింపుకోవాలి, ఆస్తులు ఎలా కూడా బెట్టుకోవాలని చూస్తున్నారు తప్ప! నేరస్థుడి మెంటల్ కండిషన్ అర్థం చేసుకొని వాణ్ణి లోపల వేయాలా ! సమాజంలో ఉండానీయాలా అనే విషయాన్ని అంచనా వేయడంలో విఫలం అవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఏసీబీ అధికారులకు దొరికిన లంచావతారులైన ఉన్నతాధికారుల ఆస్తులు చూస్తుంటే.. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ దోషులని కాదు కానీ కొందరు స్వార్థ పరులైన పోలీసు అధికారుల వల్ల రక్షణ వ్యవస్థకే చెడ్డపేరు రావడం బాధకలిగించే విషయం..

అదేవిధంగా ఊహించనంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఒక నేరస్తుడి ఆలోచనలు పసిగట్టడంలో పోలీస్ శాఖ ఎందుకు విఫలం అవుతుందో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇన్ని దారుణాలు చూస్తున్న రక్ష భటుల వ్యవస్థలో ఇకనైనా మార్పు వస్తుందా? లేదా? అనేది కాలమే సమాధానం చెప్పాలి..

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

9848070809

#telangana#police department#rangareddy#shaabad#rajkumar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి