పైసా లేనిదే పని చేయని అధికారులు?
డబ్బు పడేస్తే తిమ్మిని బమ్మిని చేస్తున్న వైనం?
కొంతమంది అధికారుల తీరుపై నిఘా నివేదికలు
అయినా ఏం చేయలేని పరిస్థితి?
పోలీస్ శాఖలో కలవర పెడుతున్న పైరవీల పనులు
శాంతి భద్రతలకే ముప్పు తెస్తున్న తీరు
షాబాద్ ఘటనతో అయినా మారతారా?
పచ్చ నోట్లకు కక్కుర్తి పడకుండా పని చేస్తారా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్, 9848070809
ప్రపంచంలోని 182 దేశాల్లో ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనం, పాలనలో నమ్మదైన పురోగతి విషయంలో భారత్ 91వ స్థానంలో ఉంది. అయితే, 2018లో సీఎంఎస్ ఇండియా దేశంలో కరెప్షన్ స్టడీ చేసింది. అప్పుడు తెలంగాణ 2వ స్థానంలో నిలించింది. మధ్యవర్తులతో లేదా నేరుగా లంచం అడుగుతున్న అధికారులు 73 శాతం మంది. 2025 లెక్కల ప్రకారం సౌత్ ఇండియాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రెవెన్యూ, మున్సిపాల్టీ, పోలీస్, విద్యుత్ రంగాల్లో ఎక్కువగా ప్రజల వద్ద నుంచి లంచాలు అడుగుతున్నారు. ఫ్రీగా చేయాల్సిన ప్రజా సర్వీసులకు ఎక్కడో ఒక దగ్గర డబ్బులు నొక్కేస్తున్నారు. ఎంతో పారదర్శకతంగా ఉండాలని ప్రభుత్వాలు అన్ లైన్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నా ప్రజలకు ఆ సేవలు నేరుగా అందడం లేదు.
2025 నుంచి పెరిగిన ఎన్పోర్స్మెంట్
ఒక్క 2025లోనే ఏసీబీ 199 కేసులు నమోదు చేసి 273 మందిని ఆరెస్ట్ చేసింది. ఇది 2024 కంటే 22.4 శాతం ఎక్కువ. 157 కేసులు ట్రాప్ చేసినవి. 176 మంది పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారు. 2026లో అయితే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూన్ 16 కల్లా 165 కేసులు నమోదు అయ్యాయి. అందులో అధికంగా పోలీస్ శాఖకు చెందిన 14 కేసులు రిజిస్టర్ చేశారు. ఒక్క జూన్ రెండు వారాల్లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. అందులో అందరూ రూ.200 కోట్ల వరకు సంపాదించినవారే. 14 ఏండ్ల తర్వాత అత్యధిక మందిని పట్టుకుంది ఏసీబీ.
పోలీస్ శాఖలో పైరవీలు
ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం పోలీస్ శాఖనే. అలాంటి శాఖ అవినీతితో ప్రజలకు ఎలాంటి మెరుగైన సేవలు అందిస్తోందో తాజా ఘటనలు అద్దం పడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి చేస్తున్న అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. అధికారంలో ఉండే నేతలు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మాదాపూర్ లాంటి ఏరియాల్లో కోట్లాది రూపాయల సెటిల్మెంట్స్ చేస్తున్నారని ప్రైవేట్ కేసులు వేస్తే కాని కేసులు నమోదు చేయని పరిస్థితి నెలకొంది. బదిలీల ఉత్తర్వులు వచ్చినా అడ్డుకుని ఆగడాలు కొనసాగిస్తున్న తీరు కనిపిస్తోంది. ఇలా పోలీసులు అంటే భయం లేకపోవడంతో నేరాలు భారీగా పెరుగుతున్నాయి. చట్టాలంటే భయం లేకుండా పోతోంది. షాబాద్ రాజ్ కుమార్ ఘటనలో పోలీసుల నిర్లక్యం, లాబీయింగులకు నిలువటద్దంలా కనిపిస్తున్నాయి.












