కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ అమితంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు వీకెండ్ సెలవు దినాలు కావడంతో దేశ నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ రద్దీ ఈరోజు(సోమవారం) వరకూ ఇంకా కొనసాగుతోంది. దీనివల్ల తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
ఎండ తీవ్రత, క్యూలైన్లలో వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున, టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పాలు, తాగునీరు, అల్పాహారాన్ని అందిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీకి సంబంధించిన వివరాలను ఆలయ అధికారులు విడుదల చేశారు. నిన్న ఒక్కరోజే 90,130 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శన మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారికి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటూ, మొక్కుల రూపంలో నిన్న 38,075 మంది భక్తులు తలనీలాలు సమర్పించి కల్యాణకట్టలో తలనీలాల మొక్కును తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది.
నిన్న ఒక్కరోజే భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం ఏకంగా రూ.4.13కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ సాధారణ స్థితికి రావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో భక్తులు దేవస్థానం జారీ చేస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని భక్తులకు సూచనలు చేస్తున్నారు. టోకెన్లు లేని భక్తులు ఓపికతో వేచి ఉండి స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. ఆలయ నియమ నిబంధనలను పాటించి అధికారులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.












