రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్.. అన్నదాతలకు నీళ్తిస్తారా? లేదా? అంటూ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే మంత్రులు ఆగమేఘాల మీద ప్రాజెక్టుల పురోగతిపై పరిశీలనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అయినా వర్షాలు పడితే ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం త్వరితగతిన పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు ఆఫ్‌టేక్ పాయింట్, పంపింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత దేవాదుల నుంచి బయలుదేరి మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆఫ్‌టేక్ పాయింట్, నీటి సరఫరాపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు. పనుల వేగవంతంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
సాగు నీరు,కేంద్రం నిధులపై సమీక్ష..
దేవాదుల, సీతారామ సాగర్ ప్రాజెక్టుల పనుల పురోగతి, నీటి వాడకం, సాగు నీరు లభ్యత, పెండింగ్ నిర్మాణాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి.సమీక్ష తర్వాత సీతారామసాగర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ రానున్నారు. అనంతరం కేంద్రం నుంచి నిధుల విడుదల, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఇతర కీలక నీటిపారుదల అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.












