కేవలం వంద రూపాయల బైక్ ట్యాక్సీ ఛార్జీని ఎగ్గొట్టడానికి ఒక మహిళా ప్రయాణికురాలు అర్ధరాత్రి పూట నడిరోడ్డుపై చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. కష్టపడి పని చేసుకునే ఒక రాపిడో రైడర్‌ను సదరు మహిళ తీవ్ర పదజాలంతో దూషిస్తూ, వేధింపుల కేసు పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసిన ఉదంతం నగరంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళా ప్రయాణికురాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాపిడో బైక్ బుక్ చేసుకుని ప్రయాణించింది. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత రైడర్ యాప్‌లో చూపించిన విధంగా కేవలం వంద రూపాయల బిల్లు చెల్లించమని కోరాడు. అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన సదరు మహిళ, రైడర్‌పై తిరగబడటమే కాకుండా అకారణంగా దుర్భాషలాడుతూ రచ్చ చేయడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా.. తనను వేధించాడంటూ పోలీసులకు తప్పుడు కేసు పెడతానని బెదిరింపులకు దిగింది.
మహిళ ప్రవర్తనతో షాక్‌కు గురైన రాపిడో రైడర్ ఆమె చేస్తున్న అన్యాయాన్ని, దుర్భాషలాడుతున్న తీరును తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. "డబ్బులు ఇవ్వకుండా ఎందుకు నన్ను తిడుతున్నారు?" అంటూ అతడు ప్రశ్నించినప్పటికీ, ఆమె సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో సదరు రైడర్ ఆమెను వెంబడించి, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు రావాలని గట్టిగా డిమాండ్ చేశాడు.
ఈ గొడవకు సంబంధించిన పూర్తి దృశ్యాలను సదరు ర్యాపిడో రైడర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కేవలం వంద రూపాయల కోసం ఒక కష్టజీవిని నడిరోడ్డుపై అంతలా వేధించడం, మహిళ అనే విషయాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడతానని బెదిరించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడైన రాపిడో రైడర్‌కు న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కింద ప్లే బటర్ క్లిక్ చేసి చూడొచ్చు.












