రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన షాబాద్ వరుస హత్యల కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆరుగురిని అతి దారుణంగా పొట్టనబెట్టుకున్న కిరాతకుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు పట్టుకునే లోపే అతడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలికానికి సంబంధించి నిందితుడి కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు అతడి ఆచూకీని సూర్యాపేటలో గుర్తించినట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు చుట్టుముట్టే క్రమంలో ఈ పరిణామం సంభవించినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరు హత్యలు చేసిన అనంతరం పరారీలో ఉన్న రాజ్‌కుమార్ కోసం పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టారు. టెక్నికల్ టీమ్ ఆధారంగా అతడు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి, పోలీసులు దాడి చేయడానికి ముందే రాజ్‌కుమార్ తీవ్ర భయాందోళనకు గురై తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని రహస్యంగా ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.












