తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామళై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో నివసించే నిజమైన హిందువు ఎవరినీ తక్కువగా చూడరని, అందరినీ సమానంగా చూస్తాడని పేర్కొన్నారు. ఎవరు గొప్పవాడు, ఎవరు తక్కువ వాడు అని చూడడని వెల్లడించాడు. పొల్లాచిలో ‘వి ది లీడర్స్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తాను గర్వించదగిన జాతీయవాదినని, భారతీయుడని మాజీ ఐపీఎస్ వ్యాఖ్యానించారు.
మొన్నటివరకు జాతీయ పార్టీ అయిన బీజేపీలో కొనసాగిన ఆయన.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అన్నాడీఎంకే పార్టీతో కలిసి పోటీ చేయడంపై ఆయన పెదవివిరిచారు. బీజేపీ గెలిచే స్థానాల్లో అన్నాడీఎంకేకు సీట్లు ఇవ్వడాన్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.ఎన్నికలు ముగిసాక.. టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ వదులుకున్న స్థానాల్లోనూ అన్నాడీఎంకే సభ్యులు ఓడిపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పారు.
ఆ తర్వాత ‘వి ది లీడర్స్’ ఫాండేషన్‌ను ప్రారంభించారు. ప్రజాసమస్యలపై గళం విప్పేందుకు యువత తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ద్వారా తన పేజీకి 10 లక్షల మంది నుంచి మద్దతు లభించింది. యువత రాజకీయాల్లోకి రావడమే లక్ష్యంగా వి ది లీడర్స్ పేరిట క్యాంపెయిన్ రన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పొల్లాచిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ.. ‘నేను హిందువునే. కానీ, బయట అడుగుపెట్టినప్పుడు నా కులం, మతాన్ని ఇంట్లోనే వదిలేస్తాను. ప్రతిసారి మతాన్ని హైలెట్ చేసి ప్రదర్శించాల్సిన అవసరం లేదు.నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడు. ఒకరు గొప్పవారు, మరొకరు గొప్పవారు కాదని చూడడన్నరు. అందరూ కలిసి ఒకే మార్గంలో నడవాలని చెబుతాడు. అదే నా హిందూత్వం. గత ఎన్నికల్లో విజయ్ సర్కారు ఏర్పాటవ్వడంలో యువతే కీ రోల్ పోషించారని గుర్తించారు.రాబోయే రోజుల్లో చెడు వ్యసనాలు, సమస్యలు, ఇబ్బందులు, మాదకద్రవ్యాల కట్టడి, అవినీతికివ్యతిరేకంగా పోరాటం కోసం అంతా కలిసి రావాలని అన్నామలై పిలుపునిచ్చారు.












