ఏపీలో దారుణం చోటుచేసుకుంది.ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. వేగంగా బైక్ నడిపే క్రమంలో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్టు సమాచారం. దాంతో బైక్ నడిపిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు యువకులు సైతం ప్రాణాలు కోల్పోయారు.దీంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకివెళితే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అతివేగంతో వచ్చిన స్పోర్ట్స్ బైక్ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.గాదరాడ గ్రామం నుండి కోరుకొండ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మరిణించిన మృతులు గాదరాడకు చెందిన నక్కా అంజన్న (30), సాడిపల్లి వీర దుర్గా (26), కుర్రం నాగు (24)గా గుర్తించారు.
ప్రమాద తీవ్రతకు బైక్ ముందరి భాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకులు మద్యం తాగి ఉన్నరా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతివేగం ప్రాణాపాయం అని ఎన్ని సార్లు అవగాహన కల్పించినా వినిపించుకోవడం లేదని, ఫలితాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
https://x.com/RTVnewsnetwork/status/2076507446659719455?s=20












