కృష్టా, గోదావరి జలాల్లో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందుకే వాటిని నిలిపివేసేలా ఆర్డర్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోరారు. కాగా, సుప్రీంకోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేమని స్పష్టంచేసింది.
న్యాయమూర్తి వ్యాఖ్యలతో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు, కృష్ణా నీటి వినియోగం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అంశాలపై తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తక్షణమే స్టే (ఇంజెక్షన్ ఆర్డర్స్) ఇవ్వడంతో పాటు నోటీసులు జారీ చేయాలని అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. తెలంగాణ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో తీవ్ర సాంకేతిక లోపాలు ఉన్నాయని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం వేలెత్తి చూపించింది. పిటిషన్‌లోని ఆ లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఎలాంటి విచారణ చేపట్టడం కుదరదని పేర్కొంది. తొలుత ఆ లోపాలను సరిదిద్దిన తర్వాతే విచారణలో మిగతా అంశాలను పరిశీలిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా, పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండా, ప్రాథమిక లోపాలు ఉన్న స్థితిలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం, ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ అస్సలు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా,దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది. ఎలాంటి ప్రకటన చేస్తుందో అనేది వేచిచూడాల్సిందే.












