తెలంగాణ

SCCL: బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర' ప్రారంభం..

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించిన చారిత్రాత్మక నిర్ణయాన్ని కార్మికుల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ బీజేపీ సోమవారం 'సింగరేణి భరోసా యాత్ర'కు శ్రీకారం చుట్టింది.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించిన చారిత్రాత్మక నిర్ణయాన్ని కార్మికుల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ బీజేపీ సోమవారం 'సింగరేణి భరోసా యాత్ర'కు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు లతో కూడిన ముఖ్య నేతలు ఈ రెండు రోజుల యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు లచేరుకున్న ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.

ఈ ప్రత్యేక యాత్ర ద్వారా నాలుగు జిల్లాల పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల కార్మికులను క్షేత్రస్థాయిలో కలిసి, సంస్థ భవిష్యత్తు కోసం కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాలను నేతలు వివరించనున్నారు. తాడిచెర్ల-2 బ్లాక్ కేటాయింపుతో సింగరేణి దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు గట్టి పునాది పడిందని, ఇది కార్మికుల్లో కొత్త నమ్మకాన్ని నింపిందని రాంచందర్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అయితే, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్‌తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టాయని ఆయన విమర్శించారు. ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ కీలక ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కారు మాత్రమే సంస్థను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బొగ్గు గనులను వేలం ద్వారానే కేటాయించాల్సి ఉన్నప్పటికీ, సింగరేణి కోసం చట్టపరమైన మార్గాలను అన్వేషించి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే తాడిచెర్ల-2ను ప్రత్యేకంగా కేటాయించారన్నారు. కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు తాము స్వయంగా ప్రధానితో మాట్లాడి ఈ ఘనత సాధించామని ఆయన వెల్లడించారు.

#Singareni Bharosa Yatra#Singareni Coal Mines#Kishan Reddy#Ramchander Rao#Tadicherla 2 Coal Block#Telangana BJP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి