Tamannaah Bhatia: చిత్ర పరిశ్రమలో ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో కానీ, 'మిల్కీ బ్యూటీ' తమన్నా దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. గ్లామర్ పాత్రలైనా, నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ అయినా తనదైన శైలిలో మెప్పించింది. అయితే, ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తుంటే.. మరోవైపు ఆమెకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరైనా పట్టించుకుంటారు. గత కొంతకాలంగా తెలుగులో తమన్నాకు సరైన హిట్స్ లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'భోళా శంకర్' తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇక భారీ హైప్‌తో, డిఫరెంట్ మేకోవర్‌తో వచ్చిన ‘ఓదెల 2’ సైతం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. ఈ పరాజయాల ప్రభావం ఆమె టాలీవుడ్ కెరీర్‌పై గట్టిగానే పడింది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గినా.. స్పెషల్ సాంగ్స్ తో తమన్నా నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘జైలర్’లో ‘కావాలయ్య’ పాటతో దేశాన్ని ఊపేసిన మిల్కీ బ్యూటీ, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘స్త్రీ 2’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపింది. అజయ్ దేవగణ్ సినిమాలోనూ మెరిసింది. నార్త్‌లో ఆమె క్రేజ్ చూసి హిందీ మేకర్స్ వరుసగా నాలుగు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. కానీ, ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తమన్నాను.. మన టాలీవుడ్ మేకర్స్ మాత్రం చివరకు ఆ స్పెషల్ సాంగ్స్ కోసం కూడా పిలవడం లేదు.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ పక్కన జోడీగా మెరిసిన ఈ ముద్దుగుమ్మకు, ఇప్పుడు కనీసం ఒక్క పాట ఛాన్స్ కూడా రాకపోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే, టాలీవుడ్ ఎప్పుడూ టాలెంట్‌ను వదులుకోదు. బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఆమె చేస్తున్న సినిమాలు కనుక మంచి విజయం సాధిస్తే.. మళ్లీ తెలుగులో మిల్కీ బ్యూటీకి గ్రాండ్ వెల్‌కమ్ లభించడం ఖాయం. మరి ఆ రీ-ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.












