Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆయన సోదరి పద్మావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత కొంతకాలంగా కొరియాకు చెందిన హాయిన్ (జిన్నీ) అనే యువతితో ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఇటలీలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన కలర్‌ఫుల్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఈ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ, కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడంతో అభిమానులు ఈ ఫొటోలను చూసి ఖుషీ అవుతున్నారు.
ఇకపోతే గల్లా జయదేవ్ పెద్ద కుమారుడు అశోక్ గల్లా ఇప్పటికే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘వీసా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, చిన్న కుమారుడైన సిద్ధార్థ్ గల్లా మాత్రం గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటూ, తమ ఫ్యామిలీ బిజినెస్ సామ్రాజ్యాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. వ్యాపార రంగంలో బిజీగా ఉంటూనే, కొరియన్ అమ్మాయి హాయిన్‌తో ప్రేమలో పడిన సిద్ధార్థ్.. ఇప్పుడు ఆమెనే తన జీవిత భాగస్వామినిగా ఎంచుకోవడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.












