కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శల వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి ప్రధాన కారకులైన వీరిద్దరూ తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసి, ఇప్పుడు తిరిగి విమర్శలకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చే ఎలాంటి మార్గదర్శకాలను పాటించడానికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజకీయం చేయడం లేదని, పూర్తిగా నిపుణుల కమిటీ సలహాల మేరకే అడుగులు వేస్తోందని చెప్పారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని, ప్రాజెక్టును వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.
రక్తం చిందిస్తామంటూ హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, హరీశ్‌కు అంత ధైర్యం లేదన్నారు. కేవలం ప్రజలను భావోద్వేగాలకు గురిచేసి పబ్బం గడుపుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఎప్పుడూ హింసను, ఉద్రిక్తతలను ప్రేరేపించే రాజకీయాలనే నమ్ముకుందని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం బడ్జెట్ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈటలకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే కేసీఆర్, హరీశ్‌లను ఒప్పించి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. తాము కూడా కేంద్రంతో, ఎన్‌డీఎస్‌ఏతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానేసి, సమస్య పరిష్కారానికి సహకరించాలని జగ్గారెడ్డి కోరారు.












