International

Us vs Iran: ఇరాన్‌‌ను రౌండప్ చేసిన అమెరికా.. మూడో రోజూ వైమానిక దాడులు

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడమే ధ్యేయంగా.. అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులతో విరుచుకుపడింది.

 పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడమే ధ్యేయంగా.. అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులతో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఈ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. ఇరాన్ తీరప్రాంత నిఘా వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ బాంబుల వర్షానికి బుషెహర్, బందర్ అబ్బాస్ పోర్ట్, కిష్, క్విష్మ్ దీవులు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి.

 ఈ దాడులు మరో రెండు మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఒక రేడియో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జాగ్రోస్ పర్వత శ్రేణుల్లోని భూగర్భంలో అత్యంత పటిష్టంగా నిర్మించిన ఇరాన్ అణు స్థావరం 'పికాక్స్ మౌంటైన్'ను తాము పూర్తిగా కూల్చివేయబోతున్నామని హెచ్చరించారు. ఈ దాడిని అడ్డుకోవడం ఇరాన్ తరం కాదని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 మరోవైపు, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా సైన్యం రౌండప్ చేసింది. హర్మూజ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఒమన్ తీరంలో ఇటీవల జరిగిన నౌక దాడి నేపథ్యంలో, ఇకపై హర్మూజ్ గుండా ఇరాన్, దాని అనుబంధ నౌకల రాకపోకలపై పూర్తి దిగ్బంధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా ఇతర దేశాల వాణిజ్య నౌకల రక్షణ బాధ్యతలను తామే చూసుకుంటామని, అందుకు ప్రతిగా 20శాతం అదనపు టోల్ రుసుము వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.

 అమెరికా చేపట్టిన ఈ అక్రమ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, హర్మూజ్ జలసంధి తమ సార్వభౌమత్వానికి సంబంధించినదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) గట్టిగానే ప్రతిఘటించింది. తాజా దాడులతో ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భద్రత తీవ్రంగా దెబ్బతింటాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

 

#USIranTensions#USAirStrikesIran#DonaldTrumpIran#HormuzStraitBlockade#WestAsiaConflict#PicaxeMountainStrike
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి