రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. తమ వెనుక పార్టీ ఉన్నదని, మంత్రి ఉన్నాడని వాళ్లు చూసుకుంటారులే అన్న అధికార దాహంతో సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నట్టు సామాన్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరైతే ఏకంగా కబ్జాలు, రియల్ దందాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఆక్రమణలకు పాల్పడే వారికి ఇలాంటి వారే వెన్నుతడుతున్నట్టు తెలుస్తోంది.
ఏకంగా ఎమ్మెల్యే, మంత్రులు తమ వెనుక ఉన్నారని చెప్పుకుంటూ అక్రమంగా కూడబెడుతున్నట్టు సమాచారం. చోటామోటా లీడర్లు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారికి పోలీసులు సైతం పరోక్షంగా సాయం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ధైర్యం చేసి వీరి మీద ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తే పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా ములుగు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుల ఆధ్వర్యంలో జోరుగా పేకాట దందా నడుస్తున్నట్టు సమాచారం. మంత్రి అనుచరులు కావడంతో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.పేకాట దందా సాగిస్తూ కెమెరాకు మంత్రి ప్రధాన అనుచరుడు కెమెరాకు చిక్కాడు.అతను జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ష వడ్ల వెంకన్నగా తెలుస్తోంది.ఆధారాలు ఉన్నా, ఎంతమంది ఫిర్యాదు చేసినా.. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.












