సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. మంగళవారం(నేడు) ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో కీలక భేటీ కానున్నారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, వాటి డిజైన్ల ఖరారుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. విమానాల ఓవర్‌హాలింగ్, రిపేర్లు, మెయింటెనెన్స్‌తో పాటు ఎయిర్ కార్గో సదుపాయాల కల్పనను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్‌లను కలిసి హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడంతో పాటు, కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పర్యటనకు ముందు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఎంపీలతో రేవంత్‌రెడ్డి బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను ప్రత్యేకంగా తేనేటి విందుకు ఆహ్వానించారు. ఈ 'ఛాయ్ పే చర్చ'లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక భేటీలో హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు కేంద్రం నుండి అనుమతులు వచ్చేలా సహకరించాలని బీజేపీ ఎంపీలను ముఖ్యమంత్రి కోరారు. దీనిపై ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. కేంద్రం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న సహకారానికి తగ్గట్టుగానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రానికి అదే స్థాయి మద్దతు లభించాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా మెట్రో రైలు విస్తరణలో కేంద్రం సూచించిన ప్రతిపాదనలే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతూ, ఎంఎంటీఎస్ సేవలను శంకర్‌పల్లి వరకు పొడిగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎంకు సూచించారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ప్రత్యేక కోటా ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు, రాష్ట్రంలో ధాన్యం సేకరణతో పాటు ఇతర పరిపాలనాపరమైన ఇబ్బందులు, వాటికి గల తక్షణ పరిష్కార మార్గాలపై సీనియర్ నేత ఈటల రాజేందర్ విలువైన సలహాలు అందించారు.












