ఒకప్పుడు పిల్లలకి మార్కులు తక్కువొస్తే టీచర్లు క్లాస్ పీకేవారు... కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! తాజాగా విడుదలైన తెలంగాణ టెట్ ఫలితాలు చూస్తే, విద్యార్థుల కంటే ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులకే ట్యూషన్ క్లాసులు పెట్టాలేమో అనే అనుమానం రాక మానదు. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ర్యాంకులు ఇచ్చే మన సర్కారు పంతుళ్లు, తీరా తాము పరీక్ష రాసేసరికి మాత్రం కథ అంతా అడ్డం తిరిగింది.
తెలంగాణలో ఇటీవల వెలువడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గత నెలలో నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా, వారిలో కేవలం 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు. అత్యధికంగా 14,814 మంది ఉపాధ్యాయులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతేడాదితో పోలిస్తే ఈసారి ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది. పోయినసారి రాసిన వారిలో 50 శాతం మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వగా, ఈ విడతలో అది కేవలం 37.29 శాతానికే పరిమితమైంది. ప్రైవేట్ పాఠశాలల అభ్యర్థులతో పోలిస్తే, ఇప్పటికే విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ స్థాయిలో విఫలం కావడం గమనార్హం. ఈ ఫలితాలు ఇలా ఉండగా, ప్రస్తుతం అనుత్తీర్ణులుగా నిలిచిన ఉపాధ్యాయులపై ఉద్యోగ గండం పొంచి ఉంది.
విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ కచ్చితంగా టెట్ పాస్ కావాలంటూ గతంలోనే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2028 ఆగస్టు నెలలోపు గనుక టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే, సదరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, గడువు ముగిసేలోగా ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వడం అనివార్యంగా మారింది.
సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించడంతో అనుత్తీర్ణులైన ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. సిలబస్‌లో వచ్చిన మార్పులు, పెరిగిన ప్రశ్నల కాఠిన్యత వల్లే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గిందని విద్యా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.












