రాష్ట్ర ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు రచిస్తున్నా అది అనుకున్నంత మేర సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. గతంలో ఇష్టానుసారంగా భూములు ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు ముగిసినా పలుమార్లు పొడగిస్తూ వచ్చింది. అయినప్పటికీ రెగ్యులరైజేషన్ చేసుకునే వారి నుంచి ఆశించిన స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
అందుకే మరోసారి ఫీజులో 25 శాతం రాయితీ కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేలా నిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సైతం ఆదేశాలు వెళ్లాయి.ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పర్యవేక్షించాలని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్లను రేవంత్ సర్కార్ ఆదేశించింది. కాగా, ఫీజు చెల్లించడానికి మాత్రం దరఖాస్తుదారులు ముందుకురావడంలేదని తెలుస్తోంది.
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని 21.63 లక్షల దరఖాస్తులకు సమాచారం అందించగా.. 7.20 లక్షల మంది మాత్రమే చెల్లించినట్టు సమాచారం. ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు.రూ.10 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని భావించిన సర్కారుకు చివరకు నిరాశే మిగిలింది.ఇదిలాఉంటే.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సీడీఎంఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించడానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు.ఉన్న సిబ్బందిలో మెజార్టీ అధికారులు, ఉద్యోగులకు సైతం ఎస్ఐఆర్ బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా దరఖాస్తుల పరిశీలన కష్టంగా మారిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.












