రాష్ట్రంలోని రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసినందుకు గాను.. సీఎం రేవంత్ నెత్తురు చల్లుతా? అని చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్యమంత్రి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు మండిపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడటం లేదు.కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందకు పోతుందని..
ఆ నీటినే ఏపీ పోతిరెడ్డి పాడు వద్ద ఎత్తి రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగు నీటి కోసం వినియోగిస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు. కానీ, సీఎం రేవంత్ మాత్రం నీటిని లిఫ్ట్ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోతాయని, భద్రాచలం మునిగిపోతుందని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం బ్యారేజీలకు రిపేర్లు చేశాకే నీళ్లు ఎత్తిపోస్తామని అంటున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ చేసిన నెత్తురు వ్యాఖ్యలకు గాను రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV), యూత్ వింగ్ సంయుక్తంగా ఒక వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సోమవారం బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం 'తెలంగాణ భవన్' వేదికగా భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ‘సీఎం రేవంత్ రెడ్డికి రక్త దాహం’ అనే వివాదాస్పద శీర్షికను బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ ఖరారు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, తమ రక్తాన్ని ధారబోసైనా సరే రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామనే బలమైన సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఎస్ వీ నేతలు తెలిపారు. ‘రైతులకు రక్తం ఇవ్వాల్సి వచ్చినా మేం వెనకాడబోం’ అనే నినాదంతో బీఆర్ఎస్వీ, యూత్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి వస్తున్నారు. కాగా, ‘మా రక్తం ఎంతైనా ఇస్తాం.. రైతులకు నీళ్లు ఇవ్వాలని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.












