తెలంగాణ రాజకీయాల్లో ప్రతి పక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదిరిపోతుంది. రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ఆప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ కు పాలన చేతనవడం లేదని బిఆర్ఎస్ నేతలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు..
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత హీట్ ఎక్కించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేకించడమే బిఆర్ఎస్ లక్ష్యమని యెన్నం విమర్శలు గుప్పించారు.
రాజస్థాన్‌లో రుదాలీలు చనిపోయిన వారి దగ్గర ఏడుస్తారు.. కానీ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రం రాష్ట్ర అభివృద్ధిని చూసి ఏడుస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణకు మంచి జరిగినా, ప్రజలకు లాభం చేకూరినా, అభివృద్ధి జరిగినా బీఆర్ఎస్‌కు నచ్చడం లేదని ఆయన విమర్శించారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టినా విమర్శలే.. మూసీ ప్రక్షాళన చేపట్టినా విమర్శలే.. రైతులకు బోనస్ ఇచ్చినా విమర్శలేనని, 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసినా బీఆర్ఎస్‌కు బాధే మిగిలిందని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయ లబ్ధికే ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డను నిర్మించింది, డిజైన్ మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ఆ ప్రాంతం భారీ బ్యారేజీ నిర్మాణానికి అనుకూలం కాదని, ఇప్పుడు బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీ దెబ్బతిని 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులను నిపుణుల సూచనలతో కాంగ్రెస్ నిర్మించిందని పేర్కొన్నారు. కానీ రాజకీయ అవసరాల కోసం డాక్టర్, ఇంజనీర్ అవతారాలు ఎత్తే కుటుంబం బీఆర్ఎస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని రాజ్‌భవన్‌లో సంబరాలు చేసుకున్నది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని యెన్నం ఆరోపించారు. ప్రధాని మోదీతో రాజకీయ ఒప్పందాలు చేసుకుంది కూడా అదే పార్టీ నాయకత్వమని విమర్శించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ముంపు సమస్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
మెట్రో విస్తరణ కోసం కేంద్రంతో.. కృష్ణా, తుంగభద్ర జలాల అంశంపై పొరుగు రాష్ట్రాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వివరించారు. సమస్యలను బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, పరిష్కారాల దిశగా ముందుకు వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
రాజీనామా డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్టీ పగ్గాలు కేటీఆర్‌కే వెళ్లనున్నాయనే సంకేతాలతో హరీష్ రావు బీజేపీలో చేరేందుకు మార్గాలు వెతుకుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే సిద్ధిపేట, సిరిసిల్లలను వదిలి పక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. ఇండిపెండెంట్‌గా జడ్పిటిసిగా గెలిచి, కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి తన ప్రజాబలాన్ని నిరూపించుకున్న నాయకుడని కొనియాడారు.
చివరగా కేసీఆర్‌కు నేరుగా సవాల్ విసిరిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని, కాళేశ్వరం అంశంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. మీరు చెప్పేది నిజమని మమ్మల్ని ఒప్పించగలిగితే మూడు సంవత్సరాల పాటు కాళేశ్వరం నిర్వహణ బాధ్యతను బీఆర్ఎస్‌కే అప్పగిస్తామని వ్యాఖ్యానించారు.
80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి కాళేశ్వరం సమస్యకు పరిష్కారం చెప్పాలని డిమాండ్ చేశారు. మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల కోసం ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. దొంగ ఆరోపణలు మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాలని సూచిస్తూ యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి..












