గ్రామాల అభివృద్ధికి రావాల్సిన వందల కోట్ల నిధులు ఎందుకు ఆగిపోయాయి?
దీనికి కారణం ఎవరు?
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా రూ.853 కోట్ల వివాదం!
రాజకీయాల్లో ఒక చిన్న నిర్ణయం... కోట్ల రూపాయల నష్టానికి దారి తీస్తుందనే చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో, 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రావాల్సిన సుమారు రూ.853 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయాయనే విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నిధుల ప్రభావం నేరుగా గ్రామాల అభివృద్ధిపైనే పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం గ్రామ పంచాయతీలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం విడుదల చేసే నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ సకాలంలో విడుదల కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫలితంగా గ్రామాల్లో చేపట్టాల్సిన రహదారులు, పారిశుద్ధ్య పనులు, తాగు నీటి సదుపాయాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోయాయనే విమర్శలు ఎదురవుతున్నాయి..
ఇప్పటికే 16వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చినప్పటికీ, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన బకాయిల అంశం ఇంకా పరిష్కారం కాకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసినట్లు సమాచారం ఉండగా, తెలంగాణకు మాత్రం బకాయిల అంశం కారణంగా నిధుల విడుదల జరగలేదనే ప్రచారం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో గ్రామ పంచాయతీలకు రూ.1,011 కోట్లు మాత్రమే కేటాయించగా, ఇప్పటికీ సుమారు రూ.1,700 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్‌ను పెండింగ్‌లో ఉంచిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో గ్రామ పంచాయతీలు అప్పుల భారంతో నలిగిపోతున్నాయని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం నుంచి సాధారణ నిర్వహణ వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని సర్పంచులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటుంది. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..? కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందా..? గ్రామాల అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ వివాదానికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












