తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. సైన్స్ గ్రూపుల ప్రాక్టికల్ పరీక్షల విధానంలో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలను ఇకపై ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు విడివిడిగా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. కొత్త విధానంలో రెండు సంవత్సరాల్లోనూ బోర్డు నియమించే ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత మరింత పెరగనుంది.
అయితే థియరీ పరీక్షల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలు యథాతథంగా 60 మార్కులకే కొనసాగుతాయి. కానీ ప్రాక్టికల్ మార్కులను రెండు సంవత్సరాలకు సమానంగా విభజించారు. మొదటి సంవత్సరానికి 15 మార్కులు, రెండవ సంవత్సరానికి మరో 15 మార్కులు కేటాయించారు. ఇక ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షను గంటా ముప్పై నిమిషాల వ్యవధిలో నిర్వహించనున్నారు.
ఈ కొత్త విధానానికి సంబంధించిన ప్రాక్టికల్ సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, నెలవారీ షెడ్యూల్‌తో కూడిన ల్యాబ్ మాన్యువల్స్‌ను బోర్డు ఇప్పటికే తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో విద్యార్థులు ముందుగానే ప్రాక్టికల్స్‌కు సిద్ధమయ్యే అవకాశం కల్పించింది.
ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు కూడా ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. వార్షిక అకాడమిక్ ప్లాన్ ప్రకారం క్రమం తప్పకుండా ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని, పరీక్షల నాటికి విద్యార్థులు అన్ని ప్రయోగాలు పూర్తి చేసేలా చూడాలని సూచించింది.
అంతేకాదు, ప్రతి విద్యార్థి పరీక్ష సమయంలో సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాబ్‌లలో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు, ప్రాక్టికల్ మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరగడంతో పాటు, ల్యాబ్ ఆధారిత బోధన మరింత సమర్థవంతంగా అమలవుతుందని విద్యా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












