క్రైమ్

విశాఖ తీరంలో విషాదం.. ఆరుగురు మత్స్యకారులు మృతి

రచన: Desk 33 నిమిషాల పఠనం

విశాఖపట్నం సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

విశాఖపట్నం సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో.. వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని నిర్ధారించారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ఏడుగురు వేటగాళ్లు ఈ నెల 1వ తేదీన విశాఖ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఈ నెల 4న బోటులో సాంకేతిక సమస్య తలెత్తి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ విభాగాలు రెండు నౌకలు, రెండు హెలికాప్టర్లతో నాలుగు రోజుల పాటు విస్తృతంగా గాలించాయి.

ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా ఎవరి ఆచూకీ దొరకకపోవడంతో నిన్న అర్ధరాత్రి నుంచి గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వారు మరణించినట్లు భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ భారీ ప్రమాదం నుండి కరి చిన్న అనే ఒకే ఒక్క మత్స్యకారుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న అతడిని ఆదివారం 'ఎంవీ యూనివర్స్ వెల్తీ' అనే కమర్షియల్ షిప్ సిబ్బంది రక్షించారు.

ఈ ఘటనతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర విషాదం నిండింది. మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు బుధవారం బాధిత కుటుంబాలను నేరుగా కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి రూ.5లక్షలు, మత్స్యశాఖ నుండి మరో రూ.5లక్షలు కలిపి.. మొత్తం రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మృతుల కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల కుటుంబాల వేదన వర్ణనాతీతమని మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

#Apnews#fishmandeath#vizag#vishakapatnam#6people death in sea
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి