తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం తెరమీదికి వచ్చింది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగినా... రాష్ట్రంలో చెరువులను నింపే అవకాశం ప్రభుత్వం కావాలనే వదులుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. వరంగల్ జిల్లాలో దాదాపు 90 శాతం చెరువులు ఎండిపోయాయని... అయినా మోటార్లు ఆన్ చేయకుండా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది కేవలం నిర్లక్ష్యం కాదని... క్రిమినల్ నెగ్లిజెన్స్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించేందుకే తెలంగాణ నీటిని యథేచ్ఛగా వదులుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు.
దేవాదుల ప్రాజెక్టులో 71 మీటర్ల నీటి మట్టం ఉంటేనే మోటార్లు పనిచేస్తాయని... ప్రస్తుతం 75 మీటర్ల నీరు ఉన్నా కూడా సగానికి పైగా మోటార్లు ఆన్ చేయలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. నీళ్లు ఉండి కూడా రైతులకు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను వినియోగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యి లాగా అన్నీ సిద్ధంగా ఉన్నా చేతకాని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చేసిన ప్రతి వ్యాఖ్యకు ఒక్కో అక్షరానికి సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉరి తీసినా తప్పులేదని విమర్శించిన హరీశ్ రావు... నీళ్ల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారంటూ కామెంట్ చేశారు.
మేడిగడ్డ, కాళేశ్వరం, తమ్మిడిహట్టి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన హరీశ్ రావు... తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించినట్లు ఆధారాలు చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారు. లేదంటే ప్రజల ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం టాపిక్ తో పొలిటికల్ హిట్ పుట్టించిన హరీశ్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి!..












