ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుసాన్ నగరంలో ఏపీ ప్రభుత్వానికి, కొరియా కంపెనీలకు మధ్య వారధిగా పనిచేసే 'అపెక్స్-కొరియా' సహాయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలతో పాటు, ఇప్పటికే ఏపీలో ఉన్న కొరియా కంపెనీలకు కూడా ఈ కేంద్రం పూర్తిస్థాయి సేవలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం దాదాపు రూ. 9.64 లక్షల కోట్ల ఆస్తుల విలువ కలిగిన ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ 'బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్' ఉన్నతస్థాయి బృందంతో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలిచేందుకు బీఎన్‌కే వెంచర్ క్యాపిటల్ సంస్థ ముందుకు రావాలని ఆహ్వానించారు.
అమరావతితో పాటు పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ అందించాలని, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లోని తమ క్లయింట్లను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని మంత్రి కోరారు. దీనిపై బీఎన్‌కే ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సంస్థ ఉన్నతస్థాయి బోర్డుతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.












