టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన మరదలు, మాజీ నటి శిల్పా శిరోద్కర్ చెప్పిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా.. మహేష్ బాబు, నమ్రత పెళ్లయిన కొత్తలో జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ రోజుల్లో మహేష్ బాబుకు మరాఠీ భాష అస్సలు రాదని కుటుంబ సభ్యులంతా భావించేవారట. అదే నమ్మకంతో శిల్పా, నమ్రత ఇద్దరూ ఇంట్లోని వ్యక్తిగత విషయాలు, కుటుంబానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ మహేష్ ముందే మరాఠీలో మాట్లాడుకునేవారట.
తమ మాటలు ఆయనకు ఏమాత్రం అర్థం కావని అనుకుని చాలా కంఫర్ట్‌గా చర్చించేవాళ్లమని శిల్పా తెలిపారు. ఆ సమయంలో మహేష్ మాత్రం ఏమీ తెలియనట్లుగా చాలా ప్రశాంతంగా వాళ్ల మాటలన్నీ వింటూ ఉండేవారట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఒకరోజు ఎప్పటిలాగే శిల్పా, నమ్రత ఇద్దరూ మరాఠీలో మాట్లాడుకుంటుండగా.. ఒక్కసారిగా మహేష్ బాబు అదే భాషలో సమాధానం చెప్పారట. ఆయన నోట మరాఠీ వినగానే ఇద్దరూ షాక్‌కు గురయ్యారట. ఇన్నాళ్లూ ఆయనకు భాష రాదని అనుకున్న వాళ్లకు, నిజానికి అన్నీ అర్థమవుతున్నాయనే విషయం అప్పుడే తెలిసిందని శిల్పా నవ్వుతూ చెప్పారు.
మహేష్.. మా సీక్రెట్స్ అన్నీ ఇన్నాళ్లూ వింటూనే ఉన్నారు. కానీ ఒక్క మాట కూడా బయటపెట్టలేదు. మమ్మల్ని బాగా నమ్మించి మోసం చేశారు అంటూ.. వ్యాఖ్యానించారు. అయితే అదృష్టవశాత్తూ మహేష్ బాబు గురించి ఎలాంటి నెగెటివ్ విషయాలు తాము మాట్లాడుకోలేదని, లేకపోతే తమను బాగా ఆటపట్టించేవారని శిల్పా చెప్పారు.
ప్రస్తుతం ఈ సరదా సంఘటన అభిమానులను ఆకట్టుకుంటోంది. బయటకు చాలా సైలెంట్‌గా కనిపించే మహేష్ బాబు, సరైన సమయంలో చిన్న ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే వ్యక్తి అని మరోసారి ఈ ఘటన నిరూపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇందులో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.












