తెలంగాణ

అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడి

రచన: Desk 34 నిమిషాల పఠనం

సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతలపైనే మరో వర్గం నాయకులు దాడులకు తెగబడటంతో జిల్లాలోని అర్వపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • సూర్యాపేటలో కాంగ్రెస్‌ నేతల వర్గ పోరు

  • ముదిరిన వివాదం.. రక్తసిక్తమైన అర్వపల్లి

  • దాడిలో పోలీసులకు గాయాలు

  • పరిస్థితి ఉద్రిక్తం.. లాఠీచార్జ్

 సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతలపైనే మరో వర్గం నాయకులు దాడులకు తెగబడటంతో జిల్లాలోని అర్వపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు సొంత పార్టీ నేతలపైనే కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది.

 ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరులు బొలెరో వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు అర్వపల్లి మండల కేంద్రంలో వారి వాహనాన్ని అడ్డుకున్నారు.వాహనాన్ని ఆపిన ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలతో ప్రత్యర్థి వర్గంపై విరుచుకుపడ్డారు.

 ఈ దాడిలో పలువురు కాంగ్రెస్ నాయకులకూ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి జరగడంతో కొందరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. గొడవ పెద్దదై ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో అర్వపల్లి మండల కేంద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెల్లాచెదురు చేయడానికి లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం అర్వపల్లిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సొంత పార్టీ నేతల మధ్యే ఈ స్థాయిలో ఘర్షణ జరగడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#Congress#InternalClash#MandulaSamuel#ChamalaKiranKumarReddy#Suryapet#Arvapally
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి