షార్జా నుంచి కరాచీకి ఐదుగురు సిబ్బందితో బయలుదేరిన పాకిస్థాన్‌కు చెందిన ఒక ప్రైవేట్ కార్గో విమానం అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ నుంచి సమాచారం అందిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో ఈ బోయింగ్ 737 విమానానికి సంబంధాలు తెగిపోయాయి.
కరాచీకి పశ్చిమంగా 287 కిలోమీటర్ల దూరంలో బలూచిస్థాన్‌లోని ఓర్మారా తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో, పాక్ అధికారులు వివిధ రక్షణ ఏజెన్సీలతో కలిసి సముద్రంలో భారీ గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నివేదిక ప్రకారం.. 'కే2 ఎయిర్‌వేస్' సంస్థకు చెందిన ఈ విమానం రాత్రి 9:18 గంటలకు సాంకేతిక సమస్యపై కరాచీ ఏటీసీని సంప్రదించింది.
అధికారులు అప్రమత్తమై మార్గనిర్దేశం చేసేలోపే, కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే విమానం వేగంగా కిందికి పడిపోతున్నట్లు రాడార్‌లో నమోదైంది. ప్రముఖ ట్రాకింగ్ సంస్థ 'ఫ్లైట్‌రాడార్24' డేటా ప్రకారం.. ఈ విమానం గాల్లో పలుమార్లు ఎత్తును కోల్పోతూ, మళ్లీ పైకి లేస్తూ తీవ్ర అస్థిరతకు గురైంది. చివరగా కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, నిమిషానికి 22,400 అడుగుల అసాధారణ నిలువు వేగంతో సముద్రం వైపు దూసుకెళ్లినట్లు సంకేతాలు వచ్చాయి. దీంతో విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 737-400 విమానం దాదాపు 27 ఏళ్ల నాటిది కావడం గమనార్హం. 1999లో ప్యాసింజర్ విమానంగా ప్రయాణాన్ని ప్రారంభించిన దీనిని, 2012లో కార్గో విమానంగా మార్చారు. కే2 ఎయిర్‌వేస్ సంస్థ 2024 నుంచి తన సేవల్లోకి తీసుకున్న ఏకైక విమానం కూడా ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం సముద్రంలో విమాన శకలాలను గుర్తించేందుకు, ఐదుగురు సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.












