తెలంగాణ సచివాలయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.రెండ్రోజుల కింద ఆరో అంతస్తుకు భోజనాలు బంద్ అనే విషయం వెలుగులోకి రాగా.. తాజాగా చాయ్ పంచాయితీ వెలుగుచూసింది. దీంతో అసలు కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతోందని కొత్త చర్చ మొదలైంది. వరుసగా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి కేసుల్లో పట్టుబడుతున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు పనులు బంద్ చేస్తున్నారు. దీనికి తోడు తాజాగా చాయ్ లొల్లి.. దీంతో సచివాలయం ఉద్యోగులే తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ పరువుపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
సాధారణంగా ఏ ప్రభుత్వ లేదా ప్రయివేటు కార్యాలయాల్లో అయినా చాయ్‌లు తాగుతుంటారు. మహా అయితే నెలకు గరిష్టంగా ఒక వెయ్యి చాయ్‌లు వేసుకుందాం. కానీ,రాష్ట్ర సచివాలయంలో నెలకు ఏకంగా 10వేలు తాగినట్టు సమాచారం. ఇదంతా నిజమా? లేక కాంట్రాక్టర్ దొంగ బిల్లులు పెట్టారా? అనేది అర్థం కావడం లేదు. సదరు బిల్లుల ప్రకారం.. CPRO ఆఫీసులో నెలకు 10 వేల చాయ్‌లు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులో 8 వేల చాయ్‌లు, సెక్రటరీల పేషిలో 5 వేల చాయ్‌లు లెక్కల్లో తేలింది. చాయ్ డబ్బులు సమయానికి ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు బిల్లులు ఇష్టానుసారంగా వేస్తున్నట్టు సమాచారం. 1500 చాయ్‌లు సరఫరా చేసే దగ్గర 10 వేల చాయ్‌లకు బిల్లులు వేసినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే బిల్లులు ఇవ్వడం లేదని టిఫిన్స్, భోజనాల సరఫరాను కాంట్రాక్టర్లు బంద్ చేయగా.. భోజనాలు, స్నాక్స్ బిల్లుల తరహాలో చాయ్, కాఫీల బిల్లులలో కూడా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది.దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.












