రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లోపభూయిష్టంగా సాగుతున్నది. బూత్ లెవర్ ఆఫీసర్లు (బీఎల్‌వో)ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ‘సర్’ ప్రక్రియ ప్రారంభమై 12 రోజులు అవుతున్నా..ఇప్పటివరకు కనీసం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం 96 శాతం ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేసినట్టు లెక్కలు చెబుతున్నారు.
హైదరాబాద్ సహా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇంకా తమకు ఫామ్స్ అందలేదని లక్షలాది మంది ఫిర్యాదు చేస్తున్నారు.బీఎల్‌వోలు ఇంటింటికీ ఫామ్స్ పంపిణీ చేయడం లేదని సైతం ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక ఏరియాలో ఓ చోట కూర్చుని అక్కడి నుంచే అందరికీ పంపిణీ చేస్తున్నారని సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం అందిస్తున్నట్టు తెలుస్తోంది.
అయినప్పటికీ ఫామ్స్ పంపిణీలో వేగం కనిపించడం లేదు. జిల్లాల వారీగా చూసుకుంటే రంగారెడ్డి 93 శాతం, సంగారెడ్డిలో 92 శాతం, మేడ్చల్లో 88 శాతం, హైదరాబాద్ జిల్లాలో 81 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగతా జిల్లాల్లో ఇప్పటివరకు ఏ జిల్లాల్లోనూ 100 శాతం ఫామ్స్ పంపిణీ కాలేదని సమాచారం.












