మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.నిన్న సాయంత్రం కాళేశ్వరం మీద పీపీటీ నిర్వహించిన అనంతరం కన్నెపల్లి వద్ద నీళ్లు లేవని, అసలు వర్షాలే లేనప్పుడు ఎలా ఎత్తిపోస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి తోడు మేడిగడ్డ, సుందిళ్ల , అన్నారం బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని నీళ్లు ఎత్తిపోయద్దని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.
తాజాగా సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి వేముల కౌంటర్ సమాధానం ఇచ్చారు. బుధవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్న ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్‌లో 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందని, కానీ ఇప్పుడు 102 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయన్నాురు. గోదావరిలో నీళ్లు లేకపోయినా, ప్రాణహిత నది కలిసే చోటు నుంచి తీవ్ర వరద ప్రవాహం ఉందని, ప్రాణహిత నది నుంచి ఏ కాలంలో అయినా నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా నిర్మించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో అసలు నీళ్లే లేవని చెప్పి రైతులను ఆగం చేయడం సరికాదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని మాజీమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.












