నష్టాల నుంచి గట్టెక్కిన పౌల్ట్రీ రంగం
ఏడాదిలోనే రెట్టింపు ధరలు
స్కిన్‌లెస్ చికెన్ రూ.185 నుంచి రూ.320
రూ.8కి చేరిన కోడిగుడ్డు
దాణా ధరలతో రైతులపై అదనపు భారం
పండుగల సీజన్‌తో డిమాండ్ మరింత పెరిగే అవకాశం
కొన్ని నెలలుగా నష్టాలతో సతమతమైన పౌల్ట్రీ రంగం మళ్లీ లాభాల బాట పట్టింది. చికెన్‌కు డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం, ఫీడ్ ధరల ప్రభావంతో మార్కెట్లో కోడి మాంసం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఊపిరి పీల్చుకుంటుండగా, చికెన్ కొనుగోలు చేసే సామాన్య వినియోగదారులపై మాత్రం అదనపు ధరల భారం పడుతోంది. గత ఏడాది జూలై (2025)తో పోలిస్తే ప్రస్తుతం ధరలు దాదాపు రెట్టింపు కావడం విశేషం.
ఇటీవల వరకు తక్కువ ధరల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న పౌల్ట్రీ రైతులకు ప్రస్తుతం మార్కెట్ అనుకూలంగా మారింది. చికెన్ సరఫరా తగ్గడం, వినియోగం పెరగడం వల్ల లైవ్ బర్డ్‌తో పాటు డ్రెస్డ్ చికెన్ ధరలు కూడా పెరిగాయి. గతంతో పోలిస్తే కిలోకు రూ.20నుంచి రూ.50 వరకు పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారులు లాభాలు పొందుతున్నారు. వారాంతాలు, పండుగలు, శుభకార్యాల సీజన్‌లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ధరలు ఇంకా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
స్కిన్‌లెస్ చికెన్ కిలో ఏకంగా రూ.320కి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి స్కిన్‌లెస్ చికెన్ కేవలం రూ.185 మాత్రమే ఉండగా, ఇప్పుడు సరఫరా కొరత కారణంగా ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ఫీడ్, విద్యుత్, రవాణా ఖర్చులు కూడా అధికంగా ఉండటంతో భవిష్యత్తులో చికెన్ ధరలు స్థిరంగా ఉండొచ్చని పౌల్ట్రీ రంగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి కాలంలో పౌల్ట్రీ రంగంపై వేసవి ఎండలు, బర్డ్‌ఫ్లూతో లేయర్, బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఫలితంగా చికెన్, గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. వేసవి నష్టాలకు భయపడి చాలా మంది రైతులు కొత్త బ్యాచ్‌ల పెంపకాన్ని ఆలస్యంగా ప్రారంభించడంతో మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకుండా పోయింది. చికెన్‌తో పాటు మార్కెట్‌లో కోడిగుడ్డు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో వినియోగదారునికి కోడిగుడ్డు ధర రూ.8.00 పలుకుతోంది.
మరోవైపు మార్కెట్లో కోళ్ల దాణా ఖర్చులు కూడా రైతులకు భారంగా మారాయి. మొక్కజొన్న క్వింటాలు రూ.2,400, సోయా రూ.6,000, నూకలు రూ.2,100 చొప్పున పెరగడంతో ప్రస్తుతం దాణా ఖర్చు క్వింటాలుకు దాదాపు రూ.31,000 మార్కును తాకింది. బ్రాయిలర్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాదాపు 90 నుంచి 95 శాతం మంది రైతులు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పంద (కాంట్రాక్ట్) పద్ధతిలోనే కోళ్లను పెంచుతున్నారు. సొంతంగా పెట్టుబడి పెట్టి పెంపకం చేపట్టిన కొద్దిమంది రైతులకు మాత్రమే ఈ ధరల పెరుగుదలతో నేరుగా భారీ ఆదాయం వస్తోంది.
మార్కెట్ రేట్లు పెరిగినప్పుడు సాధారణ కాంట్రాక్ట్ రైతుల కంటే కార్పొరేట్ వ్యాపారులకే అత్యధికంగా లాభాలు అందుతున్నాయి. పౌల్ట్రీ రంగం లాభాల బాట పట్టినప్పటికీ, నిత్యాహారమైన చికెన్, గుడ్డు ధరలు పెరగడం సామాన్య వినియోగదారుడికి పెద్ద భారంగా మారింది. ఈ రేట్ల ప్రభావం ఇటు ఇళ్లలోనే కాకుండా పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాలపై కూడా పడుతోంది. ధరల భారం వల్ల చాలా మంది వినియోగం తగ్గించుకుంటున్నప్పటికీ, మార్కెట్ ట్రెండ్ ఇలాగే మరికొన్నాళ్లు కొనసాగితే పౌల్ట్రీ రంగం మరింత ఆశాజనకంగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.












