జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)అధికారులు బుధవారం తెల్లవారుజామున విజయవాడలో ఆకస్మిక సోదాలు జరిపారు.పట్టణంలోని వించిపేటలో ఉదయం 5 గంటల నుంచే ఎన్‌ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.ఇటీవల విజయవాడలో వెలుగుచూసిన టెర్రర్ లింకుల కేసుకు సంబంధించి ఈ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన వ్యక్తుల అనుమానితుల ఇళ్లు, నివసిస్తున్న ప్రాంతాలను ఎన్‌ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గతేడాది మార్చి, మే నెలల్లో ఇదే ప్రాంతంలో ఎన్ఐఏ దాడులు జరిపి మహహ్మద్ డానిష్, సుహైల్ బేగ్, మహమ్మద్ రహంతుల్లాను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో నమోదైన టెర్రర్ సింపతైజర్స్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న లింకులపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగానే ఈ తాజా రైడ్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభ్యమయ్యాయనే దానిపై ఎన్‌ఐఏ అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉన్నది.












