డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ సంచలన అంశాలను వెలుగులోకి తెచ్చింది. సోదాల సందర్భంగా భీమ్ రెడ్డి నివాసంలో రెండు మెమొరీ కార్డులు, ఒక డైరీ, అలాగే "మనకు ఇవ్వాల్సిన వాళ్లు" అంటూ రాసుకున్న వివరాలతో కూడిన ఫోటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు "నేను ఇవ్వవాల్సినవి" అంటూ తన అప్పుల వివరాలను కూడా భీమ్ రెడ్డి నమోదు చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
మెమొరీ కార్డుల్లో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భారీ మొత్తంలో ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం భీమ్ రెడ్డి ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం నివసిస్తున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారనే ప్రశ్నకు భీమ్ రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేదని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.
అక్రమాస్తులు కూడబెట్టడంలో భీమ్ రెడ్డి అత్యంత తెలివిగా వ్యవహరించారని ఏసీబీ తెలిపింది. మొదట తన పేరుపై ఆస్తులను కొనుగోలు చేసి, అనంతరం వాటిని బినామీల పేర్లకు బదిలీ చేశారని గుర్తించింది. భవిష్యత్తులో బినామీలు తిరగబడే అవకాశం ఉందని ముందే ఊహించిన భీమ్ రెడ్డి, వారి వద్ద నుంచి ముందుగానే క్యాన్సిలేషన్ డీడీలు తీసుకుని భద్రపరచుకున్నట్లు వెల్లడించింది. అవసరమైనప్పుడు అదే క్యాన్సిలేషన్ డీడీల ఆధారంగా తన ఆస్తులపై ఆధిపత్యాన్ని కొనసాగించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వివరించింది.
సోదాలు జరుగుతున్న సమయంలో భీమ్ రెడ్డి శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారని ఏసీబీ తెలిపింది. వెంటనే ఆయన ఇంటి సమీపంలో ఉన్న ఎంబీబీఎస్ వైద్యుడితో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బెడ్ రెస్ట్ సూచించడంతో పాటు బీపీలో మార్పులు చోటు చేసుకుంటున్న కారణంగా ప్రయాణం చేయవద్దని సూచించినట్లు వెల్లడించింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే అరెస్ట్ చేయకుండా వైద్య చికిత్సకు అవకాశం కల్పించి, అనంతరం సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించి కార్డియాలజిస్టులతో చికిత్స అందించినట్లు తెలిపింది. విచారణ మొత్తం సమయంలో భీమ్ రెడ్డి సహకరించలేదని, అక్రమాస్తులపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మౌనం పాటించారని ఏసీబీ పేర్కొంది. ఆయనను అరెస్ట్ చేయకపోతే బినామీలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.
ఇప్పటికే గుర్తించిన ఆస్తులకు తోడు మరిన్ని అక్రమాస్తులు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసిన అధికారులు, సోదాల్లో పది బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లను గుర్తించినట్లు వెల్లడించారు. వీటిపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
చట్టం కన్నుగప్పి నిర్మించుకున్న అవినీతి సామ్రాజ్యాలు ఎన్నటికైనా కూలిపోక తప్పదని.. పాపపు పునాదుల మీద కట్టిన ఏ అవినీతి కోటైనా.. బీటలు వారక తప్పదని, కాలం విసిరే ఉచ్చు నుంచి ఏ అక్రమార్కుడూ బయటపడలేడని డీఎస్పీ భీమ్ రెడ్డి ఉదంతం నిరూపిస్తుంది.












