క్రైమ్

ముసలోడే కానీ.. జనానికి మత్తెక్కించాడు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

పైకి చూస్తే... అనుభవం నిండిన వయసు! సమాజంలో గౌరవంగా బ్రతకవలసిన ఆ వ్యక్తి ఆలోచనలు అడ్డదారి తొక్కాయి. చట్టం కళ్ళు కప్పి, క్రైమ్‌నే తన ఉపాధిగా మార్చుకున్నాడు! డబ్బులకు ఆశపడి వేసిన ఒక్క తప్పుడు అడుగు... అతన్ని కటకటాల పాలు చేసింది.

యూట్యూబ్ వీడియోలు చూసి వైన్ తయారీ నేర్చుకున్న ఓ వృద్ధుడికి.. అదే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇంట్లోనే వైన్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యవహారాన్ని మల్కాజ్‌గిరి జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు బయటపెట్టారు.

స్వయం ఉపాధి పేరుతో గత ఏడాది కాలంగా ఆంటోనీ ఫీటర్ అనే వ్యక్తి అక్రమంగా వైన్ తయారు చేస్తున్నాడనే సమాచారంతో డీటీఎఫ్ సీఐ భరత్ కుమార్, ఎస్సై శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించారు. తన ఇంటినే చిన్న వైన్ తయారీ కేంద్రంగా మార్చుకున్న నిందితుడు ఏకంగా ఏడు రకాల ఫ్లేవర్లలో వైన్ తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

గ్రేప్స్, పైనాపిల్, జామ, మోసంబి, సపోటా, అరటిపండు మాత్రమే కాదు... తమలపాకు ఫ్లేవర్‌తో కూడా ప్రత్యేకంగా వైన్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పండ్లను సుమారు 15 రోజుల పాటు సహజంగా పులియబెట్టి, అందులో పంచదార, గోధుమలు కలిపి ప్రత్యేక ప్రక్రియ ద్వారా వడకట్టి వైన్‌గా తయారు చేస్తున్నాడు. ఈ ప్రక్రియలో సహజంగానే ఆల్కహాల్ శాతం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.

తయారైన వైన్‌ను 750 మిల్లీ లీటర్ల బాటిల్‌కు రూ.300 చొప్పున నేరేడ్‌మెట్, సికింద్రాబాద్, కాప్రా తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. దాడుల సమయంలో మొత్తం 377.7 లీటర్ల వైన్‌తో పాటు, 502 బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వైన్ విలువ సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం తయారీ, విక్రయాలు చేయడం చట్టవిరుద్ధమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఎక్సైజ్ ఆదాయానికి నష్టం కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించగా, నిందితుడితో పాటు వైన్ ను స్వాధీనం చేసుకున్నఅధికారులు కాప్రా ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

#telangana#crime#wine-making#malkajgiri#elderly-man-arrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి