పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గంట గంటకూ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో, మరో కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై మరింత తీవ్రమైన సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు తెరతీసింది..
తుర్కియేలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ వ్యవహార శైలి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఈ రాత్రే మరోసారి భారీ దాడులు జరగవచ్చని స్పష్టం చేశారు. పరిస్థితిని బట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అమెరికా వెనుకాడదని హెచ్చరించారు.
ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రాత్రి జరిగిన అమెరికా సైనిక చర్యలో ఇరాన్‌కు చెందిన 28 నౌకలను ధ్వంసం చేశామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నౌకలపై కూడా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అంతేకాదు.. ఇరాన్ విద్యుత్ గ్రిడ్, నీటి సరఫరా వ్యవస్థలు కూడా లక్ష్యాల జాబితాలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదని తాను ఆశిస్తున్నానని తెలిపారు.
ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అలాగే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో అమెరికా మరోసారి దిగ్బంధన చర్యలు చేపట్టే అవకాశం ఉందని, అయితే అవి ఇరాన్‌కు మాత్రమే పరిమితమవుతాయని పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇప్పటికే ఇరాన్‌లోని 80కి పైగా సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల ప్రభావం ఇంకా కొనసాగుతుండగానే, మరోసారి భారీ దాడులకు సిద్ధమన్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి.
టర్కీలోని నాటో సమావేశం నుంచే ఈ హెచ్చరికలు రావడం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టం చేస్తోంది. ఇరాన్ నాయకత్వం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ట్రంప్.. వారితో దౌత్యపరమైన చర్చలు కొనసాగించడం ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా.. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్‌లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు, 13 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. బహ్రెయిన్ కూడా క్షిపణి దాడులను తిప్పికొట్టినట్లు వెల్లడిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో నౌకాయానం తీవ్రంగా దెబ్బతింది. వందలాది వాణిజ్య నౌకలు సురక్షిత ప్రాంతాల్లోనే నిలిచిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర ఒక్కసారిగా ఆరు శాతానికి పైగా పెరిగి బ్యారెల్ ధర 78 డాలర్లకు చేరుకుంది.
ఇక అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా తమ తీరాల వైపు బలగాలను మోహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హబీబుల్లా సయ్యారీ హెచ్చరించారు. అమెరికా సైన్యానికి ఇరాన్ తీరాలు నరకప్రాయంగా మారుతాయని హెచ్చరించారు.
ట్రంప్ హెచ్చరికల నేపధ్యంలో ప్రపంచ దేశాల దృష్టి పశ్చిమాసియాపైనే ఉంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు యూరోపియన్ యూనియన్, అరబ్ గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసర సమావేశానికి సిద్ధమవుతున్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఈ ఘర్షణ మరింత తీవ్రమైతే.. అది చమురు మార్కెట్లకే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికీ భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.












