తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారని పేర్కొంది.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యమాలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించది తెలిపింది. కేవలం ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, వాటిని రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి, బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియకు అవసరమైన రవాణా, మిల్లింగ్, నిల్వ తదితర ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని బీజేపీ చెబుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో సరైన ధాన్యం కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.
గన్నీ బ్యాగుల కొరత, తగినంత గోదాముల లేకపోవడం, రైస్ మిల్లుల నిర్వహణలో లోపాలు వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొంది. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా, ఇప్పటివరకు కనీసం 13 శాతం కూడా పూర్తి కాలేదని బీజేపీ ఆరోపించింది.
అదే విధంగా 2024-25 రబీ సీజన్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని, 2025-26 ఖరీఫ్‌కు సంబంధించి 45 శాతం బియ్యం ఇంకా ఎఫ్‌సీఐకి చేరలేదని, అలాగే 2025-26 రబీ సీజన్‌లో 90 శాతం బియ్యం కూడా ఇంకా పెండింగ్‌లో ఉందని పేర్కొంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని బీజేపీ విమర్శించింది. సమస్యలు తలెత్తిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడం తప్ప, గోదాములు, గన్నీ బ్యాగులు, మిల్లింగ్ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ చూపలేదని ఆరోపించింది.
గత 12 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపిన బీజేపీ.. 2025-26 ధాన్యం సేకరణ కోసం రూ.37 వేల కోట్లను ఎన్సీడీసీ ద్వారా మంజూరు చేయగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.22,700 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొంది.
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్నప్పటికీ, రైతుల సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం రాజకీయమేనని బీజేపీ విమర్శించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ధర్నాకు వస్తే వాస్తవాలన్నీ ప్రజలకు వివరిస్తామని సవాల్ విసిరింది.
గాలి మాటలు మాట్లాడటం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అలవాటుగా మారిందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపదని స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు మారుతుంటాయి... కానీ రైతుల ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయడం, గోదాములు నిర్మించడం, రైస్ మిల్లుల్లో ఆధునిక మిల్లింగ్ సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని పేర్కొంది.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో సుమారు 70 శాతం వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, ఆ నిధుల ద్వారానే తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని బీజేపీ వెల్లడించింది.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి, తెలంగాణలో ధాన్యం కొనుగోలు సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
మొత్తానికి ధాన్యం కొనుగోలు విషయం కేంద్రం దృష్టికి వెళ్ళినా వారికి న్యాయం జరుగుతుందా? రైతుల ఇబ్బందులకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? ఈ అంశంపై రాజకీయాలు తగ్గి, రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు ఎప్పుడు మొదలవుతాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












