National

ద‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను ఎవ‌రు కాపాడుతున్నారు..?

రచన: Kashi7 నిమిషాల పఠనం

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాను బీజేపీ కోరక‌పోవ‌డానికి ఓ మూడు కార‌ణాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. ఆ అంశాలే ఆయ‌న్ని కాపాడుతున్నాయి. ప్ర‌ధాని మోదీ స‌హా కేంద్ర పెద్ద‌లంతా అందుకే ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు.

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తారా..?

ఆయ‌న వెనుకున్న బీజేపీ పెద్ద‌లు ఎవ‌రు..?

బీజేపీ అడుగులు ఎలా ఉండ‌బోతున్నాయి..?

ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌లు దేశం మొత్తం వ్యాపిస్తున్నాయి. ఈ వార్త‌లు ప్ర‌పంచ మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు కూడా సీజేపీ ఉద్య‌మానికి అండ‌గా నిలుస్తున్నాయి. నీట్ పేప‌ర్ లీకుల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల్సిందేన‌నే డిమాండ్ ఉధృత‌మ‌వుతోంది. మ‌రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా..? ఆయ‌న విష‌యంలో బీజేపీ ఎందుకు ఆలోచిస్తోంది..? ప్ర‌ధాని మోదీ మ‌న‌సులో అస‌లేముంది..?

ఆ.. 3 అంశాలే కాపాడుతున్నాయా..?

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాను బీజేపీ కోరక‌పోవ‌డానికి ఓ మూడు కార‌ణాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. ఆ అంశాలే ఆయ‌న్ని కాపాడుతున్నాయి. ప్ర‌ధాని మోదీ స‌హా కేంద్ర పెద్ద‌లంతా అందుకే ప‌రిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూద్దాం... తొంద‌రెందుకు అన్న‌ట్టుగా ఆగుతున్నారు.

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తే.. అది అంత‌టితోనే ఆగ‌దు. ఈ క్రెడిట్ సీజేపీతో పాటు ప్ర‌తిప‌క్షాల‌కు ద‌క్కుతుంది. ఒక‌ర‌కంగా వీళ్లంద‌రికీ అదో బూస్టింగ్‌లా ప‌నిచేస్తుంది. ప్ర‌భుత్వమ‌న్నాక ఎక్క‌డో ఒక చోట అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. ఇప్పుడు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా కోరిన ప్ర‌తిప‌క్షాలు, రేపు ఇంకొక‌రి రాజీనామాకు డిమాండ్ చేయొచ్చు. ఇది నిత్య‌కృత్యంగా మారుతుంది. అంతిమంగా ప్ర‌ధాని రాజీనామాకు కూడా ప‌ట్టుప‌ట్ట‌వ‌చ్చు. బీజేపీ నేత‌ల‌ను వెంటాడుతున్న తొలి భ‌యం ఇదే. అందుకే విద్యాశాఖ మంత్రి విష‌యంలో ఆచితూచి అడుగులేస్తున్నారు క‌మ‌ల‌నాథులు.

ఇక రెండో అంశం మోదీ ఇమేజ్. దేశంలో ప్ర‌స్తుతం మోదీని మించిన జాతీయ నాయ‌కుడు మ‌రొక‌రు లేర‌న్న‌ది నిర్వివాదాంశం. ఆ ఇమేజే ప్ర‌పంచ దేశాల్లో ఆయ‌న‌కో గుర్తింపు తెచ్చింది. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తే ఆ మ‌ర‌క‌లు ప్ర‌ధాని దాకా అంటుతాయి. మేం త‌ప్పు చేశామ‌ని కేంద్రం అంగీక‌రించిన‌ట్టే. ఇదే జ‌రిగితే.. మోదీ ఇమేజ్ దెబ్బ‌తింటుంది. ఒక్క‌సారి బ్యాడ్ టైమ్ స్టార్ట‌యిందంటే.. అది ఆగ‌దు. రాజ‌కీయాల్లో మంచి పేరు రావ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంది. అదే చెడ్డ‌పేరు రావ‌డానికి ఒక్క ఇన్సిడెంట్ చాలు. అందుకే ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో ఎటూ తేల్చుకోలేక‌పోతోంది కేంద్రం.

నిన్న మొన్న‌టి దాకా కాక్రోచ్ జ‌న‌తా పార్టీని ఓ జోక్‌గా అభివ‌ర్ణించారు బీజేపీ నాయ‌కులు. సోష‌ల్ మీడియాలో పుట్టిన పార్టీ సోష‌ల్ మీడియాలోనే క‌నుమ‌రుగ‌వుతుంద‌ని చెబుతూ వ‌చ్చారు. ఆ పార్టీకి అంత సీన్ లేద‌న్న‌ట్టు మాట్లాడారు. ఇప్పుడు అదే పార్టీ డిమాండ్‌కు త‌లొగ్గి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తే సీజేపీని వారు గుర్తించిన‌ట్టే. ఈ భ‌యం కూడా బీజేపీ నాయ‌కుల‌ను వెంటాడుతోంది.

వాస్త‌వానికి నీట్ పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డిన వారిని ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. దీని వెనుక కేంద్ర మంత్రి ఉన్నార‌ని చెప్ప‌లేం. కానీ.. నైతి బాధ్య‌త వ‌హించాల‌ని మాత్రం అంతా డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలో కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న‌ప్పుడు 2012లో 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం జ‌రిగింది. ఈ కేసులో అప్ప‌టి టెలికాం మంత్రి ఎ. రాజా రాజీనామా చేశారు. అయినా నైతిక బాధ్య‌త వ‌హిస్తూ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ రాజీనామా చేయాల‌ని బీజేపీ అప్ప‌ట్లో పెద్ద ఉద్య‌మ‌మే న‌డిపింది. మ‌రి.. ఇప్పుడు కేంద్రానికి ఆ రూల్ వ‌ర్తించ‌దా అని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

అందుకే అంత్య నిష్ఠూరం క‌న్నా ఆది నిష్ఠూర‌మే మేల‌ని బీజేపీ భావిస్తోంది. ఈ ఉద్య‌మాలు, ఘ‌ర్ష‌ణ‌లు కొద్ది రోజుల త‌ర్వాత స‌ర్దుకుంటాయిలే అని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. ఐతే ఉద్య‌మం ఇంత‌టితో ఆగకుండా అన్ని రాష్ట్రాల‌కు పాకితే.. అప్పుడు అదుపు చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. కాబ‌ట్టి కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో మోదీ ఏ క్ష‌ణంలోనైనా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌నే వార్త‌లూ వినిపిస్తున్నాయి.

#Dharmendra Pradhan Resignation#NEET Controversy#PM Modi#BJP News#Congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి