తెలంగాణ

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రెండో విడత 'ఇందిరమ్మ ఇళ్లు' గుడిసెల్లో ఉంటున్న వారికే!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలకే పరిమితమైన 43వేల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను మంజూరు చేయాలని అధికారికంగా నిర్ణయించింది.

తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలకే పరిమితమైన 43వేల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను మంజూరు చేయాలని అధికారికంగా నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 82,890 పూరిళ్లు ఉన్నట్లు గుర్తించగా, వారిలో అత్యంత అర్హులైన 43 వేల మందికి తొలి ప్రాధాన్యత కింద ఇళ్లను కేటాయించనున్నారు.

 మరో రాబోయే వారం నుంచి పది రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్లు, మంత్రుల ఆమోదంతో అనుమతి పత్రాలు అందజేయడానికి గృహ నిర్మాణశాఖ ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఈ క్షేత్రస్థాయి సర్వే గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,421 పూరి గుడిసెలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (3,328), నల్గొండ (3,142), మెదక్ (2,955) జిల్లాలు నిలిచాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రాజన్న సిరిసిల్లలో 399, కరీంనగర్‌లో 359, జగిత్యాలలో 356 కుటుంబాలు గుడిసెలలోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తేలింది.

కోర్ అర్బన్ రీజియన్ (CURE) మినహాయిస్తే రంగారెడ్డిలో 318, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేవలం 58 కుటుంబాలు మాత్రమే పూరిళ్లలో నివాసం ఉంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది. మొత్తంగా రెండో దశ కింద క్యూర్ ప్రాంతం మినహా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. పూరి గుడిసెల్లో ఉంటున్న వారికి ఇళ్లు నిర్మించాకే మిగిలిన కోటాను ఆర్థికంగా అత్యంత వెనుకబడిన (L-1) వర్గాలకు కేటాయిస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ బృహత్తర కార్యక్రమం కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ.10,400కోట్లు కేటాయించింది.

ఓఆర్‌ఆర్ లోపలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మినహాయించి, మిగిలిన 100 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1,500 ఇళ్ల చొప్పున మొత్తం 1.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఆధునిక 'షీర్ వాల్ టెక్నాలజీ'తో గృహ నిర్మాణ శాఖయే స్వయంగా కాంట్రాక్టర్లు, అంకుర సంస్థల (స్టార్టప్స్) భాగస్వామ్యంతో ఈ 43వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలని భావిస్తోంది. దీనివల్ల లబ్ధిదారులపై ఎలాంటి ముందస్తు ఆర్థిక భారం పడకుండా, నాణ్యమైన కాంక్రీట్ ఇళ్లు అతి తక్కువ సమయంలో పూర్తి కానున్నాయి.

మరోవైపు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అరకొరగా ప్రారంభమై, నేటికీ అసంపూర్తిగా మిగిలిపోయిన ఇందిరమ్మ ఇళ్లను సైతం పూర్తి చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. పునాదులు పూర్తయి గోడలు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడల నిర్మాణం పూర్తయి స్లాబ్ దశలో ఆగిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తొలి విడత ఇళ్ల నిర్మాణం దాదాపు ముగింపు దశకు చేరడంతో, లబ్ధిదారులకు త్వరలోనే సొంతింటి కల నెరవేరబోతోంది.

#Indiramma Indlu#Telangana Housing Scheme#Ponguleti Srinivas Reddy#Free Housing Telangana#Indiramma Indlu Phase 2#Shear Wall Technology
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి