మూడు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు ఇలా ప్రారంభం అవ్వడం.. అలా వాయిదా పడటం జరుగుతోంది. కేంద్రం ఎన్నిమార్లు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష ఎంపీలు మాత్రం అస్సలు వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. పార్లమెంటు వెలుపలా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తుంటే.. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి.
అటు విద్యార్థులు, ఇటు ఇండియా కూటమి ఎంపీల ప్రధాన డిమాండ్ ఒక్కటే.కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలి.ఇక నీట్ పేపర్ లీకేజీ మీద పార్లమెంటులో చర్చ పెడతామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు నిన్న ప్రకటించారు. గురువారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ఇలా ప్రారంభం అయ్యాయో లేదో..విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టారు.
స్పీకర్ ఓం బిర్లా మధ్యలో కలుగజేసుకుని ‘నీట్’పై చర్చిద్దామని చెప్పినా..వినిపించుకోకుండా విపక్ష సభ్యులు ఆవేశంతో పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఓ దశలో అధికార బీజేపీ ఎంపీలు, విపక్ష ఎంపీల మధ్య పోటాపోటీ నినాదాలు సభలో హోరెత్తాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా లోక్‌సభను వాయిదా వేశారు.దీంతో నాలుగో రోజూ ఎలాంటి అర్థవంతమైన చర్చలు లేకుండా సభ మరోసారి వాయిదా పడింది. అంతకుముందు పార్లమెంట్ ప్రవేశద్వారం ‘మకర్ ద్వార్’ వద్ద ఎన్డీఏ, ఇండియా కూటమి సభ్యులు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. తమ తమ డిమాండ్లను వినిపిస్తూ ప్లకార్డులు సైతం ప్రదర్శించారు.












