సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. దేశంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోడీ నివాసం ముట్టడికి యత్నించి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ పర్యటనలో భాగంగా నీట్ పేపర్ లీకేజీక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీనిర్వహించారు.అందులో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పేపర్ లీకేజీలు జరిగాయని.. దానికి కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించినట్టు తెలిసింది.
తాజాగా దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కేసీఆర్, కేటీఆర్ వల్లే పేపర్ లీక్‌లు జరిగాయన్న రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన ఆయన.. కనీసం ఒక్కసారైనా చీఫ్ మినిస్టర్‌లా ప్రవర్తించు రేవంత్ రెడ్డి.. పేపర్ లీక్ లాంటి దురదృష్టకర ఘటనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం నీ పదవికే అవమానకరం. గ్లోబరీనాతో బీఆర్ఎస్‌కు గానీ, నా కుటుంబానికి గానీ, నాకు గానీ ఎలాంటి సంబంధం లేదు.
త్వరలో నీకు లీగల్ నోటీసులు పంపిస్తాను, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.నీ అసభ్యకరమైన, అర్థంలేని ఆరోపణలకు చాలాసార్లు నేను స్పందించను. అందుకని నీతో ఏకీభవిస్తున్నానని కాదు. బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు.. అందుకే మౌనంగా ఉంటాను’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్,డిస్ట్రిబ్యూషన్‌ను గ్లోబరీనా సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. పలుమార్లు పేపర్ లీకేజీ కావడంతో నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత ఏకంగా కేసీఆర్ గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.












