పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్, బస్టాండ్ ప్రాంతాల్లో నిత్యం పశువులు రోడ్లపైనే సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. పగలు రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా తిరుగుతుండగా.. రాత్రి వేళల్లో ఏకంగా రోడ్లపైనే పడుకుని సేదతీరుతున్నాయి.
పశువులను తప్పించుకునే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోవడం.. పశువులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనాలు బ్రేకులు వేయాల్సి రావడం.. కొన్ని సందర్భాల్లో పశువులు పోట్లాడుకుంటూ వాహనదారులపై పడటం.. ఇలా ప్రమాదకర పరిస్థితులు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటం, గుంతలు, రద్దీ వంటి సమస్యలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
అలాగే మంథని పరిధిలోని ఇతర రహదారుల్లోనూ ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లక్కేపూర్ క్రాస్ రోడ్ వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన కూడా గతంలో చోటుచేసుకుంది. ప్రమాదాలు జరిగినప్పుడే స్పందించడం కాదు.. ప్రమాదాలు జరగకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జరుగుతున్న సంఘటనల ఆధారంగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అయితే గతంలో మంథని మున్సిపల్ అధికారులు కూడా రోడ్లపై పశువులను వదిలే యజమానులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పశువులను గోశాలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే.. ఆ హెచ్చరికలు ఎంతవరకు అమలయ్యాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి.. రోడ్లపై పశువులను వదిలే యజమానులకు నోటీసులు జారీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని, అవసరమైతే పశువులను గోశాలకు తరలించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.












