కాక్రోచ్ పార్టీ డిమాండ్ ఏంటి..?
ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పనవుతుందా...?
ప్రధాని ప్రకటనను తిప్పకొడుతున్న కాంగ్రెస్, సీజేపీ
నీట్ పేపర్ లీక్ అంశం కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీని లైట్ తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు వారిని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీజేపీ నిరసనలు సోమవారం నుంచి కీలక మలుపు తీసుకున్నాయి. ప్రతిపక్షాలు, సెలబ్రెటీలు మద్దతు ప్రకటిస్తుండడంతో కేంద్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. జంతర్ మంతర్ నుంచి సీజేపీ కదలడం లేదు. పార్లమెంటు సమావేశాలను విపక్షాలు జరగనీయడం లేదు. అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న డిమాండ్.. కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. మరి ఆయన రాజీనామా చేస్తారా..?
ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి తాత్కాలికంగా బ్రేకులేయాలనే ప్రయత్నమే చేస్తోంది. తాజాగా ప్రధాని మోదీ చేసిన ప్రకటన కూడా అలాగే కనిపిస్తోంది. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని కీలక ప్రకటన చేశారు. యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. దీనిని బీజేపీ నాయకులు కీలక ప్రకటనగా భావిస్తున్నారు. సీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ ప్రకటనను లైట్ తీసుకుంటున్నారు.
సీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ క్లియర్
నీట్ పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రెండు పక్షాలు ప్రకటించాయి. తాము కోరుతున్నది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కాదని, మంత్రి రాజీనామా చేసిన తర్వాతే మిగిలిన విషయాన్ని మాట్లాడుకుందామని తేల్చిచెబుతున్నాయి.
ప్రధాని మోదీ ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా వెంటనే స్పందించారు. మన యువత భవిష్యత్తుకు హాని చేసింది మీరే అంటూ బీజేపీని నిందించారు. మన విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే చూసి, బాధ్యులైన వారిని రక్షించారని ఆరోపించారు. ఇప్పుడు విద్యార్థులు డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని రాహుల్ చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. యువతపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ ఎక్స్ లో రాసుకొచ్చారు.
ఈ విషయంలో CJP కూడా స్పందించింది. ఎక్స్ వేదికగానే తమ స్టాండ్ ఏంటో క్లియర్‌గా ప్రకటించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అది తప్ప ఇంకో అంశం గురించి మాట్లాడేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు సీజేపీ నాయకులు. అటు జంతర్ మంతర్ వద్ద నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఢిల్లీలో దాదాపు 16 మెట్రో స్టేషన్లను మూసేశారు. ఒక రకంగా ఢిల్లీ అంతా అండర్ పోలీస్ కంట్రోల్ అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు వృధా ప్రయత్నమేనా..?
ఏవైనా సంచలన కేసుల్లో సత్వర న్యాయం కోసం ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా నీట్ అంశం దేశం మొత్తం సంచలనం సృష్టిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో నిరసనకారులు కొంత వెనక్కి తగ్గుతారని భావించి ఉండవచ్చు. కానీ.. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయింది. కాక్రోచ్‌ల ఉద్యమం నెమ్మదిగా దేశమంతా వ్యాపిస్తోంది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల తీర్పులు వచ్చే దాకా కూడా నిరసనకారులు ఆగకపోవచ్చు. ఈ పని కేంద్రం ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికే ఆలస్యం జరిగింది.
ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా సీజేపీ ఉద్యమాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నాయి. జెన్ జీ తో పాటు అన్ని వర్గాల మద్దతు సీజేపీకి లభిస్తుండడంతో వివిధ పార్టీలు వ్యూహాత్మకంగా ఈ ఉద్యమంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో జెన్ జీ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.












